ఉచిత నీరు ఉత్త మాటేనా..?

by  |
ఉచిత నీరు ఉత్త మాటేనా..?
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్ : గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు నెల‌కు 20వేల లీట‌ర్ల మంచినీటిని ఉచితంగా అందించే కార్య‌క్ర‌మం అమ‌లులో జాప్యం జరుగుతోంది. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1నుంచి ప్ర‌జ‌ల‌కు ఈ ప‌థ‌కాన్నివ‌ర్తింప‌ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు అధికారుల‌కు విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. కానీ కొత్త సంవ‌త్స‌రం ప్రారంభమై రోజులు గ‌డుస్తున్నా ప‌థకం అమ‌లుపై ఎటువంటి స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి మార్గ‌ద‌ర్శ‌కాలు లేవ‌ని అధికారులు పేర్కొంటుండ‌గా ఇది అస‌లు ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.. ఎప్పుడు అమ‌లులోకి వ‌స్తుంద‌నే విష‌యంలో అధికారుల వ‌ద్ద స‌మాధానం లేదు. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేశామ‌ని ప్రభుత్వం గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ జ‌ల‌మండ‌లి అధికారుల వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

10ల‌క్ష‌ల వ‌ర‌కు డొమెస్టిక్ క‌నెక్ష‌న్లు..

జీహెచ్ఎంసీ ప‌రిధిలో సుమారు 10ల‌క్ష‌ల వ‌ర‌కు డొమెస్టిక్ నీటి క‌నెక్ష‌న్లు ఉన్నాయి. ఉచిత మంచినీటి ప‌థ‌కం వ‌ర్తింప చేసుకోవ‌డానికి వినియోగ‌దారులు త‌మ ఆధార్ తోపాటు ఇత‌ర గుర్తింపుకార్డులు జ‌ల‌మండ‌లి అధికారుల‌కు ఇవ్వ‌వ‌ల‌సి ఉండ‌గా చాలా మంది వినియోగ‌దారులు త‌మ ఆధార్ కార్డుల‌ను అధికారుల‌కు అప్ప‌గించేందకు ముందుకు రావ‌డం లేదు. గ్రేట‌ర్ ప‌రిధిలోని కొన్ని డివిజ‌న్ల‌లో జ‌ల‌మండ‌లి అధికారులు వినియోగ‌దారుల ఇంటి చుట్టూ ఆధార్ కార్డులు ఇవ్వాల‌ని తిరుగుతున్నా ఆసక్తి చూప‌డం లేద‌ని ఓ జ‌ల‌మండ‌లి మేనేజర్ దిశతో చెప్పారు. దీనికంత‌టికి ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి మార్గ‌ద‌ర్శ‌కాలు లేక‌పోవ‌డ‌మే కార‌ణమ‌ని స‌మాచారం. ఈ ప‌రిస్థితుల్లో 20వేల లీట‌ర్ల ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా అమ‌లులో ఉందా..? లేదా అనేది అయోమ‌యానికి గురి చేస్తోంది.

కొర‌వ‌డిన స్ప‌ష్ట‌త‌…

న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఉచిత 20వేల మంచినీరు బ‌హుళ అంత‌స్థుల అపార్ట్ మెంట్ల విష‌యంలో వ‌ర్తిస్తుందా..? లేదా..? అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ విష‌యంలో స్థాని‌కంగా ఉన్న‌ జ‌ల‌మండ‌లి అధికారుల వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేదు. ప్ర‌భుత్వం నుంచి ఇంకా మార్గ‌ద‌ర్శ‌కాలు రాలేదని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో జ‌న‌వ‌రి 1నుంచి ఉచిత మంచినీరు అమ‌లు ఆచ‌ర‌ణ‌కు నోచుకుంటుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. గ్రేట‌ర్ ప‌రిధిలో వాణిజ్య, పారిశ్రామిక కేటగిరిలో సుమారు 45వేల వరకు కనెక్షన్‌లు ఉన్నాయి. వీటికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుందా లేదా అనేది కూడా సస్సెన్స్ గానే మిగిలింది.

ఎటువంటి ఆదేశాలు రాలేదు..

ప్ర‌జ‌ల‌కు జ‌న‌వ‌రి 1నుంచి 20వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితంగా మంచినీరు అందించాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కేవ‌లం ప‌త్రిక‌ల్లో మాత్ర‌మే చ‌దువుతున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు మాకు ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. మాకు ఆదేశాలు వ‌చ్చిన త‌ర్వాత పూర్తి వివ‌రాలు చెబుతాం.
– జ‌గ‌దీశ్వ‌ర్ రావు, డీజీఎం, జ‌ల‌మండ‌లి


Next Story

Most Viewed