ఆరేండ్ల తెలంగాణం!

by  |
ఆరేండ్ల తెలంగాణం!
X

– ఐటీలో ముందుకు
– రైతు ఆత్మహత్యల్లో సెకండ్ ప్లేస్
– రైతుబంధుకు కత్తిరింపులు
– ఆదాయ వనరుగా మారిన లిక్కర్
– కృష్ణా జలాల వినియోగంలో దక్షిణ తెలంగాణ లాస్
– పంచాయతీ పరిధిలోని అధికారులకే మున్సిపాలిటీ అధికారాలు

– మూసీ డెవలప్‌మెంట్‌కు పడని ముందడుగు
– 24 గంటల విద్యుత్ అందిస్తూ రికార్డు
– నాలుగురెట్లు పెరిగిన రుణం

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఆరేండ్లలో ఎన్నో సాధ్యాసాధ్యాలను చూసిన తెలంగాణ ప్రభుత్వం.. కొన్నింటిని అమలు చేయడంలో విఫలమైంది. రాష్ర్టంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. ధనిక రాష్ట్రమంటూ చెప్పుకుంటూనే అప్పులు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లుండగా ప్రస్తుతం అది 3 లక్షల కోట్లకు చేరింది. కొత్తగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కానీ, కొన్ని మున్సిపాలిటీల్లో వాటి బాధ్యతలను పంచాయతీ అధికారులకే అప్పగించింది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చార్జీలు పెంచి ప్రయాణికులపై భారాన్ని మోపింది. మొదట్లో అధికారంలోకొచ్చిన కొత్తలో పీఆర్సీ అమలు చేసిన ప్రభుత్వం తర్వాత దాని ఊసేలేదు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేక సగమే చెల్లిస్తోంది. డబ్బులు లేక రైతుబంధు విషయంలో పలు నిబంధనలు పెట్టి ఆ పథకానికి అన్నదాతలను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది.

ఐటీలో హైదరాబాద్‌ మేటి

ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అనుకూలించడంతో పలు అంతర్జాతీయ స్థాయి, బహుళ జాతి కంపెనీలు ఇక్కడ కేంద్రంగా పని చేస్తున్నాయి. దానికి తోడు నగర శివారులో ఏర్పాటైన ఐటీ పార్కుల్లో సకల సదుపాయాలు ఉండడంతో లక్షలాది మంది ఇక్కడి నుంచే పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం, మంత్రి కేటీఆర్ కృషి వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక బడా ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దీంతో ఐటీ రంగంలో హైదరాబాద్ రారాజుగా వెలుగొందుతోంది. పైగా ఇప్పుడిప్పుడే వరంగల్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు విస్తరించాయి. దాని వల్ల ఐటీ రంగంలో పని చేసేందుకు గ్రామీణ యువత కూడా అవకాశం లభించింది.

ఐటీ ఎగుమతుల వివరాలు
సంవత్సరం ఎగుమతులు(రూ.కోట్లల్లో) ఉద్యోగాలు
2014-15 66,276 3,71,174
2015-16 75,070 4,07,335
2016-17 85,370 4,31,891
2017-18 93,442 4,75,308
2018-19 1,09,219 5,43,033
2019-20 1,28,807 5,82,126

గ్రామీణ పారిశ్రామీకరణకు నోచుకోని పాలసీ

ఆరేండ్ల తెలంగాణలో బడా కంపెనీలకు ఊతమిచ్చారు. టీఎస్ ఐపాస్ పేరిట తీసుకొచ్చిన నూతన విధానం పట్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటి వరకు టీఎస్‌ ఐపాస్‌ అమలుతో 12,290 కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేస్తున్నారన్నది ప్రశంసనీయమే. వీటి ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.13.97 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ వాస్తవానికి 9,236 పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.86,867 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 6.37 లక్షల మందికి ఉపాధి లభించింది. వీటిని గమనిస్తే ప్రభుత్వం చెప్పిన లెక్కలను గమనిస్తే సగం మందికి సైతం ఉపాధి లభించలేదు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు, విద్యుత్తు బిల్లుల రీయింబర్స్‌మెంట్లను ఎప్పటికప్పుడు విడుదల చేయకపోవడం వల్ల చిన్న పరిశ్రమల బతుకులు చితికిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మధ్య వ్యత్యాసంతో అనుకున్న స్థాయిలో రాయితీలు అందుకోలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ టెక్స్ టైల్ పార్కు, ముచ్చర్ల ఫార్మా సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. దీంతో అనుకున్న స్థాయిలో ఉత్పాదక శక్తి సాధించలేదు. ప్రతి జిల్లా, మండల స్థాయిలో వనరులను బట్టి పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

భూ రికార్డుల ప్రక్షాళనతో గొడవలే

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రకటించిన అట్టహాస కార్యక్రమాల్లో భూమి రికార్డుల ప్రక్షాళన ఒకటి. భూమి రికార్డులు సరిగా లేక రుణాలు మొదలుకొని వివిధ ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత పథకాల లబ్ధిని రైతులు పొందలేకపోవటం, భూ సంబంధిత తగాదాలు పెరగటం.. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం మొత్తం గ్రామంలోని భూమిని లెక్క తేల్చడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా మారింది. ఈ కార్యక్రమంలో అనేక లోపాలు జరిగినట్లుగా అన్ని గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా తమకున్న భూమి కంటే తక్కువ భూమిని చూపిస్తూ పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని, సర్వే నెంబర్లు మార్చేశారని, వారసత్వ భూములను సరిగ్గా నమోదు చేయలేదన్న పలువురి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల అందించిన రైతుబంధు చెక్కులను సైతం కొంత మంది అందుకోలేకపోయారు. తమకున్న భూమి కంటే కొత్త పాసు పుస్తకంలో నమోదైన తక్కువ భూమికి వచ్చిన చెక్కులను తీసుకున్నట్టయితే ఆ మిగిలిన భూమిని కోల్పోతామేమో అన్న భయంతో రైతులు ఆ చెక్కులను తీసుకోలేదు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును, బతుకును నిర్ణయించే భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. భూ సంబంధిత చట్టాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్‌.ఓ.ఆర్‌. చట్టానికి తూట్లు పొడిచారని విమర్శలు ఉన్నాయి. ఎన్నో గ్రామాలకు రెవెన్యూ అధికారులు లేరు. ఇన్‌చార్జి వ్యవస్థతో గ్రామ రెవెన్యూ పాలన కొనసాగుతున్న పరిస్థితిలో పూర్తిస్థాయి ఉద్యోగులను భర్తీ చేయకుండా, ఇంతటి కీలమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక దుస్సాహసమే. అందుకే ఇప్పటికీ రికార్డుల ప్రక్షాళన పూర్తి కాలేదు. పార్టు బీ కింద పెండింగ్‌లో ఉన్న వివరాలు చెప్పేందుకు సైతం సీసీఎల్ఏ అధికారులు ససేమిరా అంటున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు, అసైన్‌మెంట్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములన్నీ కలిపి 20 లక్షల ఎకరాలకు పైగానే ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు రెండు విడతలు కలిపి 60 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మిగతావి పూర్తి చేసేందుకు రెవెన్యూ వర్గాలకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

ఎగువన గలగల.. దిగువన వెలవెల..

ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణకు సాగునీరందించే పనులు కొనసాగుతున్నాయి. రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. గోదావరిపై కాళేశ్వరంతో పాటుగా దేవాదుల, సీతారామ, భక్త రామదాసు, సీతమ్మసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దిగువన కృష్ణా జలాలను వినియోగించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతూనే ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 2015లో శంకుస్థాపన చేసిన సీఎం.. రెండేండ్లలో దాన్ని పూర్తి చేస్తామన్నారు. కానీ ఇంకా పనులు 30 శాతం కూడా చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం రూ.6 వేల కోట్లతో చేపట్టిన డిండి ప్రాజెక్టు సైతం ఇంకా కూనారిల్లుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఫ్రభుత్వం కేటాయించిన నిధులు రూ.500 కోట్లు మాత్రమే. ఆర్డీఎస్ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమనేతగా కేసీఆర్ పాదయాత్ర చేసినా ఈ ప్రాంతంలో చిన్నప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఏండ్ల తరబడి కాగితాల్లోనే ఆపేసిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి 2018 జనవరిలో శంకుస్థాపన చేశారు. ఈ పనులకు కూడా గతంలో ఓ ప్రాజెక్టు కోసం తీసుకువచ్చిన ఏడేండ్ల కిందటి పైపులు, మోటర్లను కేటాయించారు. వీటితో తుమ్మిళ్ల పనులు చేస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా సాగునీటి ఇబ్బందులు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ‌సాగర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కానీ, దక్షిణ తెలంగాణకు ప్రధానమైన ప్రాజెక్టులను మాత్రం ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.

మిషన్ కాకతీయకు కొంత బ్రేక్

రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను చేపట్టారు. రాష్ట్రంలోని 46,571 చెరువులుండగా 5 వేలకుపైగా గొలుసుకట్టు చెరువులున్నాయి. వీటిన్నింటినీ మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 22 వేల చెరువులను మరమ్మత్తులు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టీఆర్ఎస్ తొలి విడత పాలనలో చెరువుల మరమ్మతులు చేసినా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయను పట్టించుకోవడం లేదు. ఈ రెండేండ్లలో చెరువుల కోసం చాలా తక్కువ నిధులు కేటాయించారు.

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణది రెండో స్థానం

రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు మరమ్మతులు చేస్తున్నా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఆర్థిక నష్టాలతో రైతులు ఊపిరి తీసుకుంటూనే ఉన్నారు. 2018 లెక్కల ప్రకారం దేశంలో రైతుల మరణాల్లో మహారాష్ట్ర తర్వాత స్థానం తెలంగాణదే. 2018లో 692 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 562 మంది కౌలు రైతులున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇస్తామని మొదట్లో హామీ ఇచ్చింది. కానీ వారిని రైతులుగా కూడా గుర్తించడం లేదు. మరోవైపు రాష్ట్రంలో రైతుబీమా కింద 2018-19లో 17,841 మంది, 2019-20లో 8856 మంది రైతులకు బీమా అందింది. వీటిలో వివిధ కారణాలతో రైతు మృతి చెందగా.. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం ఇతర కారణాలతో చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇతర కారణాలుగా చూపించిన దాంట్లో 2018-19లో 4025 మంది, 2019-20లో 2011 మంది రైతులు ఉన్నారు. వీరిలో 90 శాతం ఆత్మహత్యలేనని భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం కూడా రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ముందున్నట్లు తెలుస్తోంది.

రైతుబంధుపై కత్తి

దేశం మొత్తం మెచ్చిన పథకం రైతు‌బంధు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వమే డబ్బులు అందించే ఈ పథకం ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదలైంది. ముందు ప్రతి ఎకరాకు రూ.‌4 వేల చొప్పున రెండు పంటలకు కలిసి ఏడాది రూ.8 వేలు అందించారు. ఎన్నికల హామీలో భాగంగా పెట్టుబడి సాయాన్నిరూ. ఎకరాలకు రూ.5వేలకు పెంచి ఏడాదికి రూ.‌10వేలకు అందించాలని నిర్ణయించారు. కానీ ముందు రెండు విడతలు సవ్యంగా జారీ చేసిన ప్రభుత్వం 2019 రబీలో 1.40 కోట్ల ఎకరాలు, ఖరీఫ్‌లో 1.45 కోట్ల ఎకరాలకు రైతు‌బంధు ఇచ్చినా.. 2019-20 రబీ నాటికి ఈ సంఖ్య ఏకంగా 78 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఖరీఫ్‌లో రూ.‌6125.54 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేయగా రబీలో రూ.‌4406.48 కోట్లను జమ చేశారు. ఇక ఇప్పుడు నియంత్రిత సాగు పేరిట ప్రభుత్వం చెప్పిన పంటలను వేస్తేనే రైతు‌బంధు వర్తింపజేస్తామని తేటతెల్లం చేసింది సర్కార్. చెప్పిన పంటలు వేసిన భూములకే రైతుబంధు వర్తింప‌చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రైతుబంధుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఈసారి రైతుబంధు వస్తుందా? లేదా? అని అయోమయంలో పడ్డారు.

రైతు వేదికలెక్కడ..?

రెండేండ్ల కిందట రైతు సమన్వయ సమితిలను ప్రారంభం చేసిన సీఎం కేసీఆర్ వారిపై వరాలు కురిపించారు. రైతు సమన్వయ సమితిలే కీలకమని, ప్రతి క్లస్టర్‌కు రైతు వేదికలను నిర్మిస్తామని, రైతులకు ఈ సమితి సభ్యులే కీలకమని ప్రకటించారు. వారికి ప్రతినెలా కొంత వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల వలే గుర్తిస్తామన్నారు. కానీ ప్రస్తుతం రైతు సమితిల ఊసే లేదు. రైతు సమన్వయ సమితి సభ్యుల ప్రస్తావనే రావడం లేదు. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పదవి కోసం నియమించినా… గ్రామస్థాయిలో మాత్రం పని లేకుండానే ఉన్నారు.

గ్రామ సచివాలయాల్లేవ్…

రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి పంచాయతీకీ గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండాలన్నారు. కొత్త చట్టం ప్రకారం 8వేల పంచాయతీలున్న రాష్ట్రంలో 12,751 గ్రామాలు ఏర్పాటయ్యాయి. కానీ ఒక్క గ్రామసచివాలయం కూడా నిర్మించలేదు. పంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఉపాధి హామీ నిధులను వాడుకోవాలని సూచించారు. దీంతో గ్రామ సచివాలయాలు పునాదుల్లోనే కూనారిల్లుతున్నాయి. ప్రతి పంచాయతీకీ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉండాలని మొదట్లో నియమించినప్పటికీ పని భారంతో చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం 4వేలపైగా పంచాయతీలకు.. పంచాయతీ కార్యదర్శులు లేరు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులతో కలుపుకుని రాష్ట్రంలోని పంచాయతీలకు ప్రతినెలా రూ.337 కోట్లు విడుదల చేస్తున్నారు. వీటిలో కేంద్రం వాటా 60 శాతానికి పైగా ఉంటుంది. మరోవైపు సొంత రాష్ట్రంలో ఉద్యోగ భద్రత ఉంటుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగులుతోంది. ఉన్న ఉద్యోగాలను సైతం తీసేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీలోని దాదాపు 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పుడు రోడ్డున పడ్డారు.

‘పవర్’ ఫుల్

ఆరేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం అనేక మలుపులు తిరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థాపిత విద్యుత్ సామర్థ్యం, కరెంటు పంపిణీ వ్యవస్థ సరిగా లేక ప్రతి రోజూ గంటల కొద్ది కరెంటు కోతలుండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టింది. అనతికాలంలోనే అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ అందించి రికార్డు సృష్టించింది. 24 గంటల విద్యుత్ కోసం పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చారు. ఆరేండ్లలో సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టి 18 వేల మెగావాట్లు సరఫరా చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి విద్యుత్ డిమాండ్ 6440 మెగావాట్లుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. దేశంలో సగటు తలసరి విద్యుత్ డిమాండ్ 1181 యూనిట్లుండగా రాష్ట్రంలో ఇది 1896 యూనిట్లుగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 7278 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండగా ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఆరేండ్లలో ఈ సామర్థ్యం 10వేలా300 మెగావాట్లకు చేరుకుంది. ఇతర రాష్ట్రాలు, సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలతో కలిపి ఈ సామర్థ్యం 15 వేల మెగావాట్ల వరకు ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డిమాండుకు తగ్గట్టు విద్యుత్‌ను అందించడానికి గానూ ఛత్తీస్‌గడ్ రాష్ట్రంతో సహా పలు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆరేండ్ల తర్వాత సరిగ్గా రాష్ట్రంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు వసూలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవగా కేంద్రం చర్చకు పెట్టిన కొత్త విద్యుత్ సవరణ చట్టం ముసాయిదా రాష్ట్రం, కేంద్రానికి మధ్య విబేధాలకు కారణమవుతోంది.

పాలనపై నజర్

విద్యారంగం: తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న విధంగా అందరికీ చదువుకునే అవకాశాలను మెరుగుపరుస్తామని టీఆర్ఎస్.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. అందులో ప్రధానమైనవి. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్బంధ విద్య, విశాలమైన ప్రాంగణంలో గురుకుల పాఠశాలలు, నూతన యూనివర్సిటీల నిర్మాణం. ‘కేజీ నుంచి పీజీ విద్య’ హామీ విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. విద్యార్థుల జనాభా ఆధారంగా మండలానికి 4 నుంచి 6 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు. గతంలో 298 గురుకులాలు ఉండగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 683 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో 10 శాతం లోపు గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. రాష్ట్రంలో 438 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన కనీసం 1,752 గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు కావాలి. జిల్లాకు ఒకటి చొప్పున ఇంజనీరింగ్ కళాశాల, ప్రతీ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా ఒక్క కాలేజీని కూడా నిర్మించలేదు. కొత్తగా యూనివర్సిటీలను సైతం ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో మహిళా, హెల్త్, వెటర్నరీ, హార్టీకల్చర్, మైనింగ్, ట్రైబల్, తెలంగాణ కల్చరల్ యూనివర్సిటీలను తీసుకొస్తామన్నారు. వీటిల్లో కొత్తగా ఒక్క యూనివర్సిటీ రాలేదు. కానీ తాజాగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి లభించింది. ప్రభుత్వ యూనివర్సీటీల్లో ప్రొఫెసర్ల నియామకాన్ని చేపట్టడం లేదు. ఆరేండ్లలో ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ నిర్మించలేదు. పైగా స్కూల్ రీలోకేషన్, రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్య వంటి నిబంధనలతో దాదాపు 3 వేల వరకూ పాఠశాలలు మూతపడ్డాయి. ఆరు వేల ఉద్యోగాలు ఖాళీ ఉండగా ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. 2012 నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. రాష్ట్రంలో సుమారు 26,050 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో మాదిరిగా డే-స్కూల్ విద్యార్థులకు ఖర్చు చేయడం లేదు. ముఖ్యమంత్రి కలలుగన్న కామన్ స్కూల్ విధానానికి ఇది వ్యతిరేకం. 2014కు ముందు తెలంగాణలో విద్యారంగానికి 12శాతం ఉన్న బడ్జెట్ కేటాయింపులు చేసేవారు. ప్రస్తుతం 6.1శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. 400పైగా జూనియర్ కాలేజీలు ఉండగా.. మెజారిటీ అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉన్నారు.

మున్సిపాలిటీలకు అధికారులు కరువు

రాష్ర్టంలో గతంలో 72 మున్సిపాలిటీలు ఉండేవి. ప్రస్తుతం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు పెంచారు. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన నగరాలకు అవసరమైన కొత్త అధికారులను నియమించలేదు. పంచాయతీ పరిధిలోని వారికే అధికార బదలాయింపులు జరిగాయి. కేంద్రప్రభుత్వ పథకమైన స్మార్ట్ సిటీలో భాగంగా రాష్ట్రం నుంచి రెండు సిటీలు మాత్రమే ఎంపికయ్యాయి. తెలంగాణలో కొత్తగా మున్సిపల్ యాక్ట్‌ను కూడా రూపొందించారు. ఇది నగరాల అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఉంది. ట్యాక్స్ పేయర్లు స్వంతంగా తమ ఆస్తులను లెక్కపెట్టి ట్యాక్స్ చెల్లించాలని సూచించడం, లోకల్ బాడీలోనే ట్యాక్స్ రేట్లు పెంచుకుని మెయింటెనెన్స్ చేసుకోవాలని సూచించడం ఇందుకు ఉదాహరణలు. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. హైదరాబాద్ జిల్లాతో అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ నాలుగు లైన్ల రోడ్లతో గ్రిడ్ నమూనాలో ఐదేండ్లలో రూపొందిస్తామన్నారు. గతంలో ఉన్న హైవేల్లోని హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ – ఖమ్మం రోడ్లు కొత్తగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఒక నగరంలో సినిమా స్టూడియోలు, ఒక నగరంలో టెక్స్‌టైల్ సిటీ, మరో నగరంలో ఎయిర్ పోర్ట్‌తో స్పోర్ట్స్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఎడ్యూకేషనల్ సిటీగా తీర్చుదిద్దుతామని హామీనిచ్చింది ప్రభుత్వం. ముచ్చర్ల, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఫార్మాసిటీల కోసం శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్లాను టైక్స్‌టైల్ పార్కుగా ప్రకటించారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయం తప్ప రాష్ట్రంలో కొత్తగా విమానశ్రయం రాలేదు. కొత్తగా సినిమా స్టూడియోలు, అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ స్టేడియాలు వంటి వాటి కోసం ఈ ఆరేండ్లలో ఒక్క దానికీ శంకుస్థాపన పడలేదు. వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్‌జీఐఏ నిర్మాణ సమయంలో జీఎంఆర్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంకెక్కడ కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు అవకాశం లేదు. అయినా టీఆర్ఎస్ తన ఎన్నికల హామీలో దీనిని చేర్చింది.

విశ్వనగరంగా హైదరాబాద్

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఆరేండ్లు గడిచినా ఒక్క ప్లాన్‌ను ఫైనలైజ్ చేయలేదు. లక్ష డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పటికీ 9వేల ఇండ్లు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌కు కేవలం రూ.200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పూర్తయ్యేది. కానీ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. మిషన్ కాకతీయ నగరంలో అమలు కాలేదు. గ్రేటర్ పరిధిలో 1970లో మూడు వేల చెరువులు ఉండగా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 851 మాత్రమే ఉన్నాయని అధికారికంగా ధృవీకరిస్తున్నారు. పాత చెరువులను రక్షించడం మాట అటుంచితే.. చెరువుల్లో కొత్తగా కబ్జాలు జరుగుతుండటం గమనార్హం.

ఆరేళ్ల తెలంగాణలో ఆర్టీసీ

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండెండ్లకు 2016లో తెలంగాణ ఆర్టీసీ ఏర్పడింది. సకల జనుల సమ్మెలో వీరోచితంగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి తమ వంతు పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చీ రాగానే 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. తర్వాతి కాలంలో కార్మికులు తమ అదనపు డిమాండ్‌ల సాధన కోసం 2019లో సకలజనుల సమ్మెను మించి 10 రోజులు ఎక్కువగా 52 రోజులు ఉద్యమించారు. పలువురు కార్మికులైతే ఏకంగా ప్రభుత్వ మొండి వైఖరిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమ్మె సందర్భంగా సీఎం కేసీఆర్ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. సంస్థనే ప్రైవేటీకరిస్తానని హెచ్చరించారు. దీంతో కార్మికులు దిగివచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఇటీవల కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌‌లో రెండు నెలలపాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సడలింపుల్లో భాగంగా హైదరాబాద్ తప్ప అన్ని ప్రాంతాల్లో అనుమతివ్వడంతో బస్సులు మళ్లీ రోడ్కెక్కాయి.

ఏరులై పారుతున్న లిక్కర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్‌ను ఒక ఆదాయ వనరుగానే భావించింది. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కొత్త పాలసీలు రూపొందించి మరీ లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం పెంపొందించుకునే దిశగా ముందుకు కదిలింది. దీనిలో భాగంగానే లిక్కర్ షాపుల సంఖ్యను గణనీయంగా పెంచి వాటి ఆవరణలో పర్మిట్ రూముల్లో సిట్టింగ్‌కు అనుమతిచ్చి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది. షాపుల వేలంపాటలో దరఖాస్తుల అమ్మకం దగ్గర నుంచి ఏ దశలో వీలైతే ఆ దశలో లిక్కర్ మీద కాసులు దండుకుంది. రాష్ట్రం ఏర్పడిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.2807 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆదాయం ఏకంగా రూ.16వేల కోట్లు వస్తుందని మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జె‌ట్‌లో అంచనా వేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖజానాకు ఆదాయం తగ్గిన ప్రతి సందర్భంలో(2019 మాంద్యంలో ఒకసారి తాజా కరోనా నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా మరోసారి) లిక్కర్ ధరలు పెంచి ఖజానాకు వసూళ్లు పెంచుకుంది.



Next Story

Most Viewed