మిగిలింది 23 రోజులే.. హుజురాబాద్‌లో రేవంత్ వ్యూహం ఏంటి.?

by  |
మిగిలింది 23 రోజులే.. హుజురాబాద్‌లో రేవంత్ వ్యూహం ఏంటి.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఓ వైపున ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే ఈ పార్టీ మాత్రం ఇంకా తొలి అడుగు కూడా వేయలేదు. ఐదు నెలలకు పైగా ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్‌లు తమ పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. నోటిఫికేషన్ వరకూ వేచి చూసే ధోరణితో ఉన్నట్టుగా వ్యవహరించిన నాయకత్వం.. చివరకు అభ్యర్థిని అయితే ప్రకటించింది. కానీ ఆయన మాత్రం ఇంకా మైదానంలోకి దిగలేదు. కేడర్ కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికినైనా కాపాడుకుంటుందా లేదా అన్నదే సంశయంగా మారిపోయింది.

23 రోజులు.. ఐదు మండలాలు..

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ పరిస్థితి ఎలా ఉందంటే 30 రోజుల్లో భాష నేర్పుకోవడం ఎలా అన్నట్టుగా తయారైంది. కేడర్ లేక, లీడర్ లేక చతికిలపడిపోయిన కాంగ్రెస్ పార్టీని హుజురాబాద్‌లో పునాదుల నుండి నిర్మాణం చేయాల్సి ఉంది. ఐదు మండలాల్లోని అన్ని గ్రామాలపై పట్టు బిగించి తన ప్రచారాన్ని కొనసాగించాల్సి ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసి కూడా నాలుగు రోజులు కావస్తున్నా నేటికీ కాంగ్రెస్ పార్టీ ఉనికి మాత్రం కనిపించడం లేదు.

దీంతో వెంకట్ ఉమ్మడి జిల్లా నేతలను కలిసి వారందరి మద్దతు కూడగట్టుకోవడంతో పాటు, స్థానికంగా అచేతనంగా మిగిలిపోయిన కొద్దో గొప్పే కేడర్‌లో జవసత్వాలు నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అవగాహన కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందులోనే నామినేషన్ వేసేందుకు ఓ రోజు సమయం గడిచిపోనుంది.

మిగతా 22 రోజుల సమయంలో పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక ఆయనకు మిగిలింది 19 రోజులే అని చెప్పక తప్పదు. సమీకరణాలు, సమీక్షలు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, తన ప్రచారం చేసుకోవడం ఇవన్నింటిని అధిగమించడం వెంకట్ ముందు ఉన్న సవాళ్లేనని చెప్పకతప్పదు.


Next Story

Most Viewed