ఒక్కసారైనా అది చూడకుండా ఉండలేకపోతున్న యువత.. ఇండియాలోనూ పెరిగిపోతున్న డేటింగ్ అడిక్షన్

by Dishafeatures2 |
ఒక్కసారైనా అది చూడకుండా ఉండలేకపోతున్న యువత.. ఇండియాలోనూ పెరిగిపోతున్న డేటింగ్ అడిక్షన్
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మ్యారేజ్ అండ్ రొమాంటిక్ రిలేషన్స్ అనేవి ప్రత్యక్ష పరిచయాల ద్వారా మాత్రమే ఏర్పడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఎటువంటి ముఖ పరిచయం లేపోయినా, ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా డేటింగ్ యాప్‌ల వినియోగం ఇప్పుడు నచ్చిన సంబంధాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇటీవల అదే స్థాయిలో ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయని, ముఖ్యంగా యువతలో డేటింగ్ యాప్ అడిక్షన్ పెరిగిపోతోందని నివేదికలు పేర్కొంటున్నాయి.

వెతకడమే తప్ప దొరకడం లేదు

‘‘నేను దాదాపు రెండేండ్ల నుంచి డేటింగ్ యాప్‌ యూజర్‌ని.. కానీ కోరుకున్న మ్యాచ్‌ ఇంత వరకు లభించడం లేదు. మరోవైపు ఈ యాప్‌లను యూజ్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నాలాగే ఇతర యూజర్లలలోనూ ఇదే జరుగుతోందని భావిస్తున్నా’ అంటున్నాడు కొల్ కతాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ డెవలపర్. ప్రజెంట్ ఇతను మల్టిపుల్ డేటింగ్ అప్లికేషన్‌లో తరచుగా నిమగ్నమై ఉండటంతో అదొక వ్యసనంగా మారింది. ఇలా ఎంతోమంది నేడు హింజ్, బంబుల్ అండ్ టిండర్ వంటి డేటింగ్ యాప్‌‌ల అడిక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు.

క్రమంగా పెరుగుతున్న వినియోగం

ఇటీవలి ఒక సర్వే ప్రకారం.. ప్రపంచంలోనే డేటింగ్ యాప్‌ల వినియోగంలో భారతదేశం ఇప్పుడు ఐదవ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఐదేండ్ల క్రితం 20 మిలియన్ల మంది భారతీయులు మాత్రమే డేటింగ్ యాప్‌లను వినియోగించగా, 2023లో ఆ సంఖ్య 82.4 మిలియన్లకు పెరిగింది. మరోవైపు ఇవి యువతను పెడదారి పట్టిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా టిండర్, హింజ్ అండ్ లీగ్ వంటి డేటింగ్ యాప్‌ల యజమానులపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా కూడా దాఖలైంది. ఇవి వినియోగదారులను శాశ్వతంగా పే టు ప్లే లూప్ లోకి లాగుతున్నాయని, కస్టమర్ల మ్యాచెస్ టార్గెట్ కంటే, కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యదారులు పేర్కొన్నారు.

90 శాతం మందిలో అదే ప్రాబ్లం

ఈ హర్మోని (eHarmony) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. డేటింగ్ యాప్‌లు యూజ్ చేస్తున్న ప్రతీ పది మంది సింగిల్స్‌లో తొమ్మిది మంది అంటే (90 శాతం) మంది డేటింగ్ యాప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. దాదాపు 48 శాతం మంది పడుకునే ముందు చివరిసారిగా ఒకసారి ఈ యాప్‌లను స్వైప్ చేయనిదే నిద్రపోరు. 39 శాతం మంది నిద్ర లేవగానే డేటింగ్ యాప్‌లను తనిఖీ చేస్తున్నారు. 12 శాతం మంది ఆల్రెడీ డేటింగ్‌లో ఉన్నప్పటికీఈ యాప్‌లను తనిఖీ చేస్తున్నారు. 28 శాతం మంది తమ పని ప్రదేశాల్లో కూడా డేటింగ్ యాప్‌లను స్వైప్ చేస్తున్నారు. దీనిని బట్టి డేటింగ్ యాప్ అడిక్షన్ ఏ లెవల్లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

కారణం - పరిష్కారం

డేటింగ్ యాప్‌ల డిజైనింగ్ మ్యాచింగ్ అండ్ నోటిఫికేషన్ ఫీచర్లు యూజర్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. వాటిని స్వైప్ చేస్తున్నప్పుడు సదరు వ్యక్తుల మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్‌ యాక్టివేట్ అయినట్లు అనిపించి తక్షణ సంతృప్తి ఏర్పడుతుంది. దీంతో వ్యసనానికి లోనవుతున్నారు. అంతేకాకుండా నిర్వాహకులు యూజర్లను అట్రాక్ట్ చేసే టెక్నిక్స్, ట్రిక్స్ ప్లే చేస్తుండటంతో పలువురు స్వైప్ చేయకుండా ఉండలేని వ్యసనంలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి తగిన ప్రభుత్వ పాలసీలు, వినియోగదారుల్లో స్వీయ అవగాహన వంటివి అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు.



Next Story