అధికారమిస్తే సాగు చట్టాలు రద్దు చేస్తాం: ప్రియాంక గాంధీ

by  |
అధికారమిస్తే సాగు చట్టాలు రద్దు చేస్తాం: ప్రియాంక గాంధీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఖాతరుచేయడం లేదని, కాంగ్రెస్‌కు అధికారమిస్తే అన్నదాతల డిమాండ్లను గౌరవించి నూతన సాగు చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలు కోటీశ్వరులకు అనుకూలంగా ఉన్నాయని, వారే రైతు పంటకు వెల కట్టే వీలు కల్పిస్తున్నాయని ఆరోపించారు. ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులను ప్రభుత్వం దేశద్రోహులని అవమానిస్తున్నదని, వాస్తవంలో రైతులను అలా పిలిచి వారే దేశద్రోహులయ్యారని విమర్శించారు.

ఆందోళనకారులని, ఉగ్రవాదులని, అతివాదులని రైతులపై ముద్ర వేస్తున్నారని, అయినప్పటికీ అన్నదాతలు దేశంపై ప్రేమనే చాటుతున్నారని అన్నారు. పొలంలోనే వారు కష్టపడుతున్నారని, సాగు చేసి దేశానికి ఆహారమందిస్తున్నారని చెప్పారు. వారెలా దేశద్రోహులవుతారని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతల ర్యాలీని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు సంధించారు. ప్రధాని మోడీకి పాకిస్తాన్ వెళ్లడానికి, చైనా పర్యటించడానికి సమయమున్నదని, కానీ, ఆయన సొంత నియోజకవర్గం సరిహద్దులోనే ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడే వీలు చిక్కకపోవడం బాధాకరమని అన్నారు. రైతులను ఆందోళనజీవి అని పిలిచి స్వయంగా అవమానపరిచారని మండిపడ్డారు.


Next Story