ఎమ్మెల్యేల ఇంటిముందు డప్పు కొట్టి నిరసిస్తాం

by  |
Congress
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఉపఎన్నిక వస్తేనే ఆ నియోజకవర్గానికి నిధులు కేటాయించడం, అభివృద్ధి జరగుతుంది కాబట్టి కార్యకర్తలంతా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, వారి ఇంటి ముందు డప్పు కొట్టి మరి నిరసన తెలియజేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా నియోజకవర్గ సమన్వయ కర్తల సమావేశం శుక్రవారం ఇందిరా భవన్‌లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రెస్‌మీట్‌లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ రేపటి నుంచి సమన్వయ కర్తలంతా గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ చేసిన మోసాలను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తారని తెలిపారు. హుజురాబాద్ మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత ఏడేళ్లుగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన 65 వేల కోట్లు ఖర్చు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ దళితుల బంధువు కాదు రాబందువు అని అన్నారు. ఆట ఇప్పుడే మొదలైందని, కేసీఆర్ పై యుద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకూ పోరాడుతామని చావడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతో ఆలస్యం చేయడానికి కొవిడ్‌ను తెరపైకి తెచ్చారని, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, బొల్లు కిషన్, బక్క జడ్సన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


Next Story