భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

by  |
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
X

దిశ, న్యూస్‌బ్యూరో: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 60అడుగులకు నీటిమట్టం చేరింది. ఏడేళ్ల అనంతరం ఈ స్థాయిలోకి నీటిమట్టం చేరడం ఇదే తొలిసారి. 2013 ఆగస్టు 3న ఇక్కడ నీటిమట్టం 61.6కి చేరింది. ఇప్పుడు మరోసారి 60 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

రాత్రికి 63అడుగులకు..

భారీగా వస్తోన్న వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగి సోమవారం రాత్రి 9 గంటలకు 63 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా నీటిమట్టం పెరుగుతుందని అటు సీడబ్ల్యూసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. 63అడుగులకు నీటిమట్టం చేరితే చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.

రెండుసార్లు మాత్రమే..

గోదావరి చరిత్రలో రెండు సార్లు మాత్రమే నీటిమట్టం 70అడుగులు దాటింది. 4సార్లు 60అడుగులు దాటి ప్రవహించింది. 1976, 1983, 2006, 2013లో నీటిమట్టం 60అడుగులు దాటిందని అధికారులు తెలిపారు. 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ ఏడాది ఆగస్టు 16న నీటిమట్టం 75.66 అడుగులుగా నమోదైంది. 1990 ఆగస్టు 24న మరోసారి 70 అడుగులు దాటి 70.8 అడుగులకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed