ఒక హత్య.. కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు

by  |
ఒక హత్య.. కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
X

దిశ, వరంగల్: రాష్ర్టంలో సంచలనం సృష్టించిన వరంగల్ శివారు గీసుగొండ మండలం గొర్రెకుంట మృతుల కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలల కిందట చేసిన ఓ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసిన నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసు ఉన్నతాధికారులు నిందితున్ని వరంగల్‌లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

బీహర్‌లోని బెగుసరాయ్ జిల్లా నుర్లపూర్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ఆరేళ్ల కింద ఉపాధి కోసం వరంగల్ నగరానికి వచ్చాడు. నగరంలోని శాంతినగర్ గోనె సంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. అప్పటికే అక్కడ పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ నుంచి మక్సూద్‌తో పరిచయం ఏర్పడింది. మక్సూ‌ద్ కుటుంబంతో సహా అందరూ అక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికాతో కుడా సంజయ్‌కు పరిచయమైంది. రఫికాతో సంజయ్‌కి పరిచయం పెరగడంతో డబ్బులిచ్చి ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. ఇదే సమయంలో భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా వున్న రఫీకాకు సంజయ్ మరింత దగ్గరయ్యాడు. అనంతరం రఫికాను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గీసుగొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండుగదుల ఇంటిని అద్దెకు తీసుకుని రఫీకా ముగ్గురు పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫికా కుమార్తెతోనూ ఆయన చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. గమనించిన రఫీకా సంజయ్‌తో పలుమార్లు గొడవపడింది. అయినప్పటికీ సంజయ్ పద్దతితో మారకపోవడంతో రఫీకా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో నిందితుడు రఫీకా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తమ పెళ్ళి విషయాన్ని బంధువులతో చర్చిందేందుకు బెంగాల్ వెళ్దామని రఫీకాను నమ్మించి మార్చి 6న విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్ రథ్ రైలు ఎక్కారు. రాత్రి పది గంటలకు ప్రయాణంలో ఉండగా.. మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి అందులో నిద్రమాత్రలు కలిపి రఫీకాకు ఇచ్చాడు. అనంతరం ఆమె మత్తులోకి వెళ్లాగానే తెల్లవారుజామున 3గంటల సమయంలో చున్నీతో గొంతు బిగించి హత్య చేసి బయటకు నెట్టిశాడు. అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగి మరో రైలు ఎక్కి వరంగల్‌కు చేరుకున్నాడు. రఫీకా బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్ళినట్టుగా ఆమె పిల్లలను నమ్మించాడు. కొద్ది రోజుల అనంతరం రఫీకా తమ బంధువుల ఇంట్లో లేదని తెలుసుకున్న మక్సూద్ ఆలం భార్య నిషా సంజయ్‌ని గట్టిగా నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన నిందితుడు మక్బూద్ అలం, భార్య నిషా అలంను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రఫీకాను చంపినట్టుగానే నిద్రమాత్రలు కలిపి చంపాలనుకున్నాడు.

దీంతో ఈ నెల 16 నుంచి 20 వరకూ రోజూ వారు నివాసం ఉంటున్న గొర్రెకుంటలోని గోనెసంచుల తయారీ కేంద్రానికి వస్తూ చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించేవాడు. ఈ నెల 20న మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజున విందు ఏర్పాటు చేసినట్టు తెలియడంతో అదే రోజు వారందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. అంతకు ముందే 18న నిందితుడు హన్మకొండ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో సూమారు 60కి పైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 20 రాత్రి 7.30 గంటల సమయంలో గోదాంకు చేరుకోని వారితో చాలా సేపు ముచ్చటించాడు. అనంతరం వారికి తెలియకుండా మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంతో పాటు, అక్కడే ఉంటున్న బీహార్ కార్మికులు శ్యాం, శ్రీరాం వాళ్ల భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. ఆ భోజనం తిన్న మక్సూద్, తన భార్య నిషా ఆలం, కూతురు బుస్రా, కుమారులు షాబాజ్ ఆలం, సుహేల్ ఆలం, మనుమడు, శ్యాం, శ్రీరాం, మహమ్మద్ షకీల్ మత్తులోకి జారుకున్నారు. అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 5గంటల సమయంలో మత్తులో వున్న తొమ్మిది మందిని గోనె సంచుల్లో ఈడ్చుకొచ్చి గోదాం పక్కనే వున్న పాడుపడ్డ బావిలో పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు మృతుల గదుల నుంచి కిరాణ సామానుతో పాటు వారి సెల్ ఫోన్ల తీసుకుని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు.

గోదాం యాజమాని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ఛేదించేందుకు ఆరు ప్రత్యేక దర్యాప్తులు బృందాల దర్యాప్తు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 సమయంలో జాన్‌పాకలోని ఇంటిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాలు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. 72 గంటల వ్యవధిలో కేసును చేధించడంలో శ్రమించిన ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మీ, మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ శివరామయ్య, పర్వతగిరి ఇన్ స్పెక్టర్ కిషన్, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్ టీం ఇన్స్ స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్ధన్ రెడ్డి, రాఘవేందర్, రమేష్ కుమార్‌తో పాటు వారీ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.


Next Story