'ఐసీసీది చెత్త ప్రతిపాదన'

by  |
ఐసీసీది చెత్త ప్రతిపాదన
X

దిశ, స్పోర్ట్స్ : బాల్ ట్యాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఐసీసీ చేసిన ప్రతిపాదనపై పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ ధ్వజమెత్తాడు. ‘ఇదొక చెత్త ప్రతిపాదన.. అసలు ఇలాంటి ఆలోచన ఐసీసీకి ఎలా వచ్చింది, ఈ తరహా ప్రతిపాదనలతో క్రికెట్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో తెలియడం లేదు’ అని వకార్ మండిపడ్డారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అందరి దృష్టి క్రికెట్ బౌలింగ్‌పై పడింది. లాలాజలం ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో.. బాల్‌ను ఉమ్మితో రుద్దడంపై నిషేధం విధించాలని ఐసీసీ భావిస్తోంది. కాగా, అదే సమయంలో బంతిని పాలిష్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో ఉంది. అవసరమైతే బంతిని వేరే రకంగా ట్యాంపర్ చేసుకునేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదిస్తోంది.

అయితే ఐసీసీ చేస్తోన్న ఈ ప్రతిపాదనపై వకార్ యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రికెట్‌లో బంతిని ఉమ్మితో రుద్ది పాలిష్ చేయడమనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. ఫీల్డ్‌లో ఉండే ప్రతీ క్రికెటర్ బంతిని బౌలర్‌కు అందించే క్రమంలో ఎన్నోసార్లు పాలిష్ చేస్తుంటారు. ఇప్పుడు కరోనాను అడ్డం పెట్టుకొని ఏకంగా అంపైర్ సమక్షంలో ట్యాంపరింగ్‌కు అనుమతించడమనేది అనాలోచిత నిర్ణయం’ అని వకార్ అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఎస్‌సీ, కూకాబుర్రా, డ్యూక్స్ బ్రాండ్ బంతులను వాడుతున్నారు. అయితే అన్ని బంతులకు ఒకే పదార్థం పని చేసేలా అనుమతించాలని ఐసీసీ కీలక సూచన చేసింది. మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్ వంటివి అనుమతిస్తే ఎలా ఉంటుందా ? అన్న కోణంలోనూ ఆలోచిస్తోంది. కాగా, ప్రస్తుతం దీనిపై విస్తృతమైన జరుగుతున్న సమయంలోనే వకార్ యూనిస్ పై విధంగా స్పందించడం గమనార్హం. అయినా క్రికెట్‌కు నష్టం కలిగించే చర్యలేవీ ఐసీసీ తీసుకోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Tags : Ball Tampering, ICC, Corona, Saliva, Wakar Younis, Bowler, Bowling



Next Story

Most Viewed