జియోలో 'విస్తా'రంగా పెట్టుబడులు!

by  |
జియోలో విస్తారంగా పెట్టుబడులు!
X

దిశ,వెబ్‌డెస్క్: లక్ష్యం ఏదైనా..లక్షణం మాత్రం దూసుకెళ్లడమే. ఈ మాట రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు సరిగ్గా సరితూగుతుంది. కరోనా కష్ట కాలంలో అనేక కంపెనీలు మూలధనాన్ని ఖర్చు చేసుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు ఏకంగా మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రిలయన్స్ సంస్థ పెట్టుబడులను ఆకర్షిస్తూ సంస్థ రుణాలను తగ్గించుకుంటోంది. ఇటీవల ప్రపంచ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ భారీ పెట్టుబడి, మరో అమెరికన్ సంస్థ వాటా కొనుగోలుతో జోరు చూపించిన రిలయన్స్ సంస్థ..తాజాగా మరో అమెరికన్ ఈక్విటీ సంస్థ విస్తా ఈక్విటీని సైతం వాటా కొనుగోలుకు ఆకర్షించింది. జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులకు విస్తా ఈక్విటీ సంస్థ ముందుకొచ్చింది.

విస్తా ఈక్విటీ సంస్థ 2.3 శాతం వాటాను రూ. 11,367 కోట్ల చెల్లింపుతో పెట్టుబడులు పెట్టనుంది. విస్తా ఈక్విటీ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్‌డ్ ఫండ్ సంస్థ. రోజుల వ్యవధిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మూడో అతిపెద్ద వాటా కొనుగోలు ఒప్పందం కుదిరింది. జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్ల వద్ద ఇన్వెస్ట్ చేసింది. ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్లు.

పెరుగుతున్న నమ్మకం…

అత్యాధునిక టెక్నాలజీ సంస్థల్లో విస్తా ఈక్విటీ పెట్టుబడులు పెడుతుంది. గడిచిన 10 ఏళ్లలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే, మన దేశంలో విస్తా ఈక్విటీ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. మంచి పేరున్న కంపెనీ కావడంతో ఈ సంస్థ పెట్టుబడులతో జియో నిర్వహణ నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో కలుగుతోంది.

మూడు వారాల్లో 60 వేల కోట్లు..

రిలయన్స్ సంస్థ ప్రకటన ప్రకారం..రిలయన్స్ జియో ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా దిగ్గజం పెట్టుబడులు పెట్టిన కొద్ది కాలానికే టెక్నాలజీ ఫోకస్‌డ్ ఫండ్ నిర్వహిస్తున్న విస్తా ఈక్విటీ జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం విశేషం. కేవలం మూడు వారాల వ్యవధిలోనే జియో ప్లాట్‌ఫామ్‌లో రూ. 60,596 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.

ఆర్థిక సంవత్సరం అదుర్స్…

జియో ప్లాట్‌ఫామ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువ మొత్తం చెల్లిస్తూ మూడు కంపెనీలు వాటాలను కొనుగోలు చేశాయి. తొలి కొనుగోలుతో ఫేస్‌బుక్ రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటా దక్కించుకోగా, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ 1.15 శాతం వాటాతో రూ. 5,655 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఇక మరో ఈక్విటీ సంస్థ అయినా విస్తా ఈక్విటీ రూ. 11,367 కోట్లతో 2.3 శాతం రిలయన్స్ సంస్థలో వాటాను దక్కించుకుంది.

Tags : vista, Equity Partners, investment, silver lake, jio platforms

Next Story