‘చక్ర’ కథ వింటున్నప్పుడే విజిల్ వేయాలనిపించింది: విశాల్

by  |
‘చక్ర’ కథ వింటున్నప్పుడే విజిల్ వేయాలనిపించింది: విశాల్
X

దిశ, సినిమా : హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్రా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘చక్ర’. ఫిబ్రవరి 19న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు విశాల్. ఈ సందర్భంగా చక్ర కథ, కథనం గురించిన కొత్త విషయాలు వివరించిన హీరో.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

తెలుగు, తమిళ ప్రజలు మా హీరో అని చెప్పుకునే అవకాశం కొద్ది మంది కథానాయకులకు మాత్రమే దక్కింది. ఈ లిస్ట్‌లో మీరు కూడా ఉండటంపై మీ అభిప్రాయం?
చాలా గర్వంగా ఉంటుంది. ఒక్కోసారి ఆనందంతో కళ్లు చెమ్మగిల్లుతాయి కూడా. 2004లో నా సినీప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అండగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.

సినిమాకు ‘చక్ర’ టైటిల్ ఎందుకు ఎంచుకున్నారు?

ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వం యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే ఉన్నత పుర‌స్కారం ‘అశోక చ‌క్ర’ అవార్డుతో హీరో తండ్రి సత్కరించబడతాడు. అయితే కొంతమంది దుండ‌గులు దాన్ని దొంగిలించ‌డంతో ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఇండియ‌న్ ఆర్మీలో ప‌నిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు? అనేది సినిమా. అందుకే చక్ర అనే టైటిల్‌ను ఎంచుకున్నాం. మూవీలో చివరి తొమ్మిది నిమిషాల థ్రిల్లింగ్ సీక్వెన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. డెఫినెట్‌గా ఆడియ‌న్స్‌ సినిమాతో క‌నెక్ట్ అవుతారు.

ట్రైల‌ర్‌లో విజువ‌ల్స్ చూస్తుంటే ‘అభిమ‌న్యుడు’ సినిమాకి సీక్వెల్ అనిపిస్తోంది..?

లేదండీ! చాలా మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఈ సినిమా విజువ‌ల్స్ చూస్తుంటే ‘అభిమ‌న్యుడు’ సినిమాలాగా అనిపిస్తుంది కానీ అభిమ‌‌న్యుడుకు, చక్రకు మూడు పోలికలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. ఇది కూడా సైబ‌ర్ క్రైమ్ థ్రిల్లర్‌. రెండు.. స‌మాజంలో జరుగుతున్న విష‌యాలు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపించ‌డం. మూడు.. నేను మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా కనిపించడం.

ఈ క‌థ‌లో కొత్త ఎలిమెంట్స్ ఏమున్నాయి?

మనం ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు దాని గురించి గూగుల్ చేస్తే వెంటనే డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే అందుకు సంబంధించిన బెస్ట్ డీల్స్, బెస్ట్ హోటల్స్ యాడ్స్ వస్తుంటాయి. అంటే మనకు ఏం కావాలి? ఎక్కడకు వెళ్లాలి అనుకుంటాం? లాంటి విషయాలపై మనతోపాటు మరొకరి నిఘా కూడా ఉంటుంది. అలాగే మనకు లాటరీ వస్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంటారు. డబ్బులు పంపిస్తామని మెయిల్స్ వస్తుంటాయి. తీరా వివరాలు పంపిస్తే అకౌంట్‌లో డబ్బులు మాయమవుతాయి. అంటే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలనే మెసేజ్‌తో కొత్తగా వస్తున్న చిత్రం అన్నమాట.

ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?

ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌మీద సినిమా చేస్తున్నప్పుడు క‌చ్చితంగా స‌మాజంలో జ‌రిగిన, జ‌రుగుతున్న విష‌యాల గురించి మాత్రమే చెప్పాలి. ఒక‌వేళ మ‌నం ఊహించి చెప్తే దాని వ‌ల్ల సామ‌న్య ప్రజ‌లను భయపెట్టినవాళ్లం అవుతాం. అందుకే ఈ క‌థ నాకు చెప్పడానికి ముందే ద‌ర్శకుడు ఎమ్‌ఎస్ ఆనంద‌న్ ఇందుకు సంబంధించిన పూర్తి రీసెర్చ్ చేశాడు. ఈ స్టోరీని నెరేట్ చేస్తున్నప్పుడు నాకు రెండు స‌న్నివేశాల్లో విజిల్ కొట్టాలి అనిపించింది. అంత బాగా క‌థ‌ రాసుకున్నాడు ద‌ర్శకుడు ఆనంద‌న్‌.

ద‌ర్శకుడు ఎమ్‌ఎస్ ఆనంద‌న్ ఫ‌స్ట్ మూవీ క‌దా! అత‌ని మేకింగ్ స్టైల్ గురించి చెప్పండి?

మాములుగా ఒక క‌థ విన‌గానే ఆలోచించుకునేందుకు టైమ్ అడుగుతాం. కానీ ఆనంద‌న్ ఈ క‌థ చెప్పిన వెంటనే కొత్త దర్శకుడు అని కూడా ఆలోచించకుండా ఎస్ చెప్పేశా. ఆనంద‌న్ ఫ‌స్ట్ సినిమాకే త‌న బెస్ట్ ఇచ్చాడు. మేకింగ్ ప‌రంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లో మ‌రో టాలెంటెడ్ డైరెక్టర్‌ను ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది.

యువ‌న్ శంక‌ర్‌రాజాతో ఇది10వ సినిమా క‌దా..?

యువ‌న్ శంక‌ర్ రాజా నా బెస్ట్ ఫ్రెండ్‌. ఓన్ బ్రద‌ర్‌లా ఫీల‌వుతా. మా ఇద్దరి కాంబినేష‌న్ త‌ప్పకుండా ఒక మ్యాజిక్ చేస్తుంద‌ని న‌మ్ముతా. అందుకే అత‌నితో ఫైట్ చేసైనా స‌రే, నా మూవీస్‌కు వ‌ర్క్ చేయించుకుంటా. ఈ సినిమాకు యువ‌న్ కావాల‌ని ఎందుకు కోరుకున్నాను? అంటే ఒక కొత్త డైరెక్టర్‌కు మంచి టెక్నీషియ‌న్ బ్యాక‌ప్ ఉంటే త‌ను అనుకున్న దాని క‌న్నా సినిమా ఇంకా బాగా తీయ‌గ‌ల‌డు. యువ‌న్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ తో పాటు అదిరిపోయే ఆర్‌ఆర్ కూడా ఇచ్చాడు. థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్ కూడా ఇదే ఫీల‌వుతారు. నా త‌దుప‌రి రెండు చిత్రాల‌కు కూడా అత‌నే మ్యూజిక్ డైరెక్టర్‌.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?

నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్యతో క‌లిసి ‘ఎనిమీ’ సినిమా చేస్తున్నా. ఆ సినిమాలో తనే నా ‘ఎనిమీ’. అలాగే నా ఓన్ డైరెక్షన్‌లో ‘అభిమ‌న్యుడు – 2’ చేస్తున్నాను. ఆ త‌ర్వాత శ‌ర‌వ‌ణ‌న్ అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ మంచి క‌థ చెప్పాడు. ఆ సినిమా కూడా వ‌న్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంద‌ని న‌మ్మకం ఉంది. ఇవే కాకుండా వ‌చ్చే ఏడాది ఉగాదికి ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. ఆ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ వర్క్ జ‌రుగుతోంది.



Next Story

Most Viewed