తరగని అందంతో బ్రాండ్ అంబాసిడర్స్‌… ఈ రోబో బిలియనీర్స్..

by  |
తరగని అందంతో బ్రాండ్ అంబాసిడర్స్‌… ఈ రోబో బిలియనీర్స్..
X

దిశ, ఫీచర్స్:రోబోలు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం అనే కాన్సెప్ట్‌ను ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసేవాళ్లం. ఆ అంశం ఎంతోమందిని ఆలోచింపజేసినా నిజమవడం అసాధ్యమనుకున్నారు. కానీ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రాడికల్ డెవలప్‌మెంట్స్ కారణంగా ప్రస్తుతం మనం రోబో ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. ఈ క్రమంలోనే వీధిలో రోబోల మధ్య నడవడానికి, జిమ్‌లో పరుగెత్తడానికి లేదా రెస్టారెంట్‌లో వాటి పక్కన భోజనం చేయడానికి ఇంకా చాలా సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ‘హ్యూమన్ టు రోబోట్(H2R)’ ఇంటరాక్షన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది నెటిజన్లు ‘వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌’ను అనుసరిస్తున్నారు. పాండమిక్ సమయంలో అవతరించిన ఈ డిజిటల్ రూపాలు.. ప్రస్తుతం నిజమైన సోషల్ మీడియా ప్రభావశీలులను అధిగమిస్తూ, కోట్లాది రూపాయలు సంపాదిస్తుండటం విశేషం. ఇంతకీ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరు? ఏం చేస్తారు? ఎలా పనిచేస్తారు?

కంప్యూటర్ ద్వారా రూపొందించిన ‘ఫిక్షనల్ హ్యుమన్స్’నే వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా CGI ఇన్‌ఫ్లుయెన్సర్‌ అని పిలుస్తున్నారు. వీళ్లు రియలిస్టిల్ క్యారెక్టరి‌స్టిక్స్‌తో పాటు ఫీచర్స్, పర్సనాలిటీలను కలిగి ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చంగా మనుషుల్లానే కనిపిస్తారు, అలానే వర్క్ చేస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమలో ప్రస్తుతం వారు నిజమైన శక్తిగా మారుతున్నారు. వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ప్రతీ వారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త అకౌంట్ ఓపెన్ అవుతోంది. ఈ క్రమంలోనే 2020 డిసెంబర్‌లో దక్షిణ కొరియా మొట్టమొదటి వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ‘రోజి’.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ఆమె.. ఎండార్స్‌మెంట్, యాడ్స్ ద్వారా ఏటా రూ. 6 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఇప్పటికే 8 స్పెషల్ కాంట్రాక్టులతో పాటు 100కు పైగా స్పాన్సర్‌షిప్స్ కలిగి ఉంది. చూడ్డానికి 22 ఏళ్ల మహిళగా కనిపించినా, ఆమె వయసు ఎప్పటికీ తరిగిపోదు. ఎందుకంటే ఆమె ఓ హ్యూమన్ రోబో.

లిల్ మిఖెలా..

19 ఏళ్ల బ్రెజిలియన్-అమెరికన్ మోడల్, సంగీత కళాకారిణి ‘లిల్ మిఖెలా’ కూడా సోషల్ మీడియా టాప్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కొనసాగుతోంది. 1.6 మిలియన్ ఫాలోవర్లు కలిగిన లిల్.. గతేడాది రూ. 85 కోట్లు సంపాదించడం విశేషం. కెల్విన్ క్లెయిన్ ప్రకటన కోసం రియల్ లైఫ్ సూపర్ మోడల్ బెల్లా హడిద్‌తో జతకట్టిన ఈ వర్చువల్ మోడల్.. #teamgalaxy ప్రచారంలో భాగంగా ఆమె శామ్‌సంగ్‌తోనూ జతకట్టింది. 2018లో టైమ్స్ విడుదల చేసిన ‘ఇంటర్నెట్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల’ జాబితాలోనూ ఆమె చోటు సంపాదించింది. ఆమె తన తాజా ఫ్యాషన్ లుక్స్‌తో పాటు ఇటీవలే విడుదల చేసిన కొత్త మ్యూజిక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వేసవిలో ‘సింగిల్స్ మనీ, స్లీపింగ్ ఇన్’ అనే పాటలను స్పోటిఫైలో విడుదల చేసింది. సుప్రీం వంటి స్ట్రీట్‌వేర్ బ్రాండ్స్, చానెల్ వంటి లగ్జరీ లేబుల్స్‌ దుస్తులను ధరిస్తూ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లోని అధునాతన రెస్టారెంట్లలో సంగీతకారులు, కళాకారులు, ప్రభావశీలులతో హ్యాంగవుట్ అవుతుంది. సెల్ఫీలకు పోజులిస్తూ తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు వెదర్ అప్‌డేట్ అందిస్తుంది.

షుడు..

ఫోటోగ్రాఫర్ కామెరాన్ జేమ్స్-విల్సన్ సృష్టి ‘షుడు’. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ప్రపంచంతో విసుగు చెందిన విల్సన్.. యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా 3D డ్రాయింగ్‌ను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతనెప్పుడూ పాత్రలను గీయడానికి, సృష్టించడానికి ఇష్టపడుతుంటాడు. అలా 3డి ప్రోగ్రామ్‌ను ఉపయోగించి 2017లో ‘షుడు’ పాత్రను సృష్టించగా, ఆమె ఇప్పుడు మోడల్‌గా రాణించడమే కాకుండా వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా దూసుకుపోతోంది. డిజిటల్ వరల్డ్‌లో షుడుకు ప్రాణం పోసినప్పటి నుంచి 185k ఫాలోవర్స్‌ను ఆకర్షించింది. డిజిటల్ సూపర్ మోడల్ ఏజెన్సీ TheDiigitals.com తో మోడలింగ్ కాంట్రాక్టుపై సంతకం చేయడంతో పాటు కేవలం రెండేళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాత వోగ్, డబ్ల్యూడబ్ల్యుడిలో కవర్ పేజీపై మెరిసింది. బాల్‌మైన్, ఎల్లెస్సీ బ్రాండ్ ప్రచారాల్లోనూ పార్టిసిపేట్ చేసింది. 2019 బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి, అందరి దృష్టిని ఆకర్షించింది.

గేమింగ్ ప్రపంచంలో ప్రసిద్ధ ఈ-స్పోర్ట్ లీగ్ ఆఫ్ లెజెండ్స్.. ‘సెరాఫిన్’ అనే వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సృష్టించగా, లక్షలాది మంది ఆమెను అభిమానిస్తున్నారు. ఇక ఇమ్మ, బెర్ముడా, బ్లాకోలు టాప్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారు.

సృష్టికర్తలెవరు?

ప్రతి ఒక్క ‘డిజిటిల్ అవతార్’ వెనుక తెలివైన సృష్టికర్తలు ఉన్నారు. బ్రాండ్స్, సాంకేతికతపై ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ ఫాలోవర్స్ పెంచడానికి ఈ వర్చువల్ బొమ్మలను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. విజువల్ క్వాలిటీకి ప్రాధాన్యతనిస్తూ.. వర్చువల్ హ్యూమన్‌ను కంప్యూటర్ గ్రాఫిక్స్, ఖచ్చితమైన గణిత మోడలింగ్ పద్ధతులు ఉపయోగించి రూపొందిస్తారు. వాళ్లు ఎలా కనిపించాలి, వేషధారణ ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? వంటి విషయాలను కూడా క్రియేటర్స్ డిసైడ్ చేస్తారు. చివరకు వాళ్లు ఎవరితో హ్యాంగవుట్ కావాలి, కొలాబారేషన్ ఎలా ఉండాలి వంటి విషయాల్ని కూడా నిర్ణయిస్తారు. ఈ విధంగా వారికి ఫాలోవర్స్‌కు పెరిగిన తర్వాత బ్రాండ్స్‌తో డీల్స్ కుదర్చుకుని పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.

బ్రాండ్స్‌కు ప్రయోజనమేంటి?

ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్.. సగటు మానవ ప్రభావశీలుర కంటే 10 రెట్లు ఎక్కువగా ఎంగేజ్ చేయగలరని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బ్రాండ్స్ తమ ప్రమోషన్ కోసం వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ రూపాలతో ఫ్లెక్సిబిలిటీ ఉండటం కూడా వారికి ప్లస్ పాయింట్. ఉదాహరణకు, రియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పొరపాటు చేస్తే, రీ-షూట్ చేయాలి. దాని ఫలితంగా, అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రచారం ప్రారంభించడం ఆలస్యం కావచ్చు. అదే వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ విషయానికి వస్తే, పొరపాటును కొన్ని నిమిషాల్లోనే తొలగించి సవరించవచ్చు. అంతేకాదు భవిష్యత్ మార్కెటింగ్‌ను ముందే ఊహించిన కొన్ని కంపెనీలు ఇందులో ముందడుగు వేశాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్ రెనాల్ట్ తమ సొంత వర్చువల్ అంబాసిడర్ లివ్‌ను సృష్టించింది, వారు తమ తాజా టెలివిజన్ ప్రకటనలో దీన్నే ఉపయోగించారు.


Next Story

Most Viewed