కిష్టా రాయనిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు..

by  |
కిష్టా రాయనిపల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు..
X

దిశ, మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాంతో మంగళవారం అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. భూ నిర్వాసితులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన లక్ష్మణాపురం, ఈదుల గండి గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో నాంపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ జి సత్యం ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసులు మోహరించారు.

పనులు చేస్తున్న యంత్రాలను భూ నిర్వాసితులు అడ్డుకోవడంతో పోలీసులకు నిర్వాసితులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది . ఏడేళ్లు కావస్తున్నా నేటికీ పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పోలీసులను పెట్టి ప్రాజెక్టు పనులు చేసుకోవడం ఎంత వరకు సబబు అని పోలీసులను నిలదీశారు. తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని భూ నిర్వాసితులు అక్కడికి వచ్చిన పోలీసులు కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. భూ నిర్వాసితులు యంత్రాలకు అడ్డుపడడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు . దాంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.



Next Story

Most Viewed