ఆ మహిళలంటే.. కరోనాకు హడల్!

by  |
ఆ మహిళలంటే.. కరోనాకు హడల్!
X

దిశ, ఫీచర్స్ : గతేడాది కరోనా పాండమిక్ సిచ్యువేషన్‌లో అనేక పల్లెలు, గ్రామాలు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించబోమని చెబుతుండగా.. పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్‌డౌన్ వైపునకు మొగ్గుచూపుతున్నాయి. అయితే సాధారణంగా గ్రామ వాలంటీర్లు, యువకులు ఈ విషయంలో చొరవ తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం మహిళలే వాలంటీర్లుగా వ్యవహరిస్తూ గ్రామస్తులు కరోనాబారిన పడకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తుండటం విశేషం. ఈ మేరకు ఊరి పొలిమేర్లలో కాపలా ఉంటూ గ్రామానికి రక్షక దళం వలె పనిచేస్తున్నారు.

మధ్యప్రదేశ్, బేతుల్ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన కొందరు మహిళలు.. చేతిలో కర్రలతో విలేజ్ ఎంట్రన్స్‌లో నిలబడి, బయటివారెవరూ తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా కాపు కాస్తు్న్నారు. కర్రలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన వీరు, తమ గ్రామంలోకి ఇతరులకు ప్రవేశం లేదని తెలిపే బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. తాము కూడా సెల్ఫ్ ప్రికాషన్స్ పాటిస్తూ.. ఊళ్లోకి ఎంటర్ అయ్యే దారులన్నింటిని వెదురు కర్రలతో మూసేసి, నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర గ్రామాల నుంచి వచ్చేవారిని తమ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. అంతేకాదు తమ గ్రామస్తులు కూడా కొవిడ్ నిబంధనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా వీరి కృషి ఫలితంగానే ఇప్పటివరకు ఈ గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

కాగా గడిచిన 24 గంటల్లోనే భారత్‌లో 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ ఉపద్రవం నుంచి ఇండియాను బయటపడేసేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.

Next Story