వ్యాక్సిన్ కొరత నిజమే.. అప్పటివరకు టీకా కేంద్రాలు బంద్ : డీహెచ్ శ్రీనివాస్

by  |
వ్యాక్సిన్ కొరత నిజమే.. అప్పటివరకు టీకా కేంద్రాలు బంద్ : డీహెచ్ శ్రీనివాస్
X

దిశప్రతినిధి , హైదరాబాద్ : కొవిడ్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకా తీసుకోవాలనుకునే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 45ఏళ్లు పై బడిన వారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హాస్పిటల్స్ ఎక్కడైనా వ్యాక్సిన్ వేయించుకోండి అని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ అంతంత మాత్రం ఏర్పాట్లు చేయడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తుండటంతో ఒకరి నుండి మరొకరికి సులువుగా వైరస్ సోకుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదివరకు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోవడంతో జనాలు టీకా తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోవడం సమస్యగా మారింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరత దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా సరఫరాను నిలిపివేయాలని హెల్త్ డెరెక్టర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వారి వద్ద మిగిలి ఉన్న డోసులను కూడా కలెక్ట్ చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నో వ్యాక్సిన్..

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ సెంటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో మొత్తం 138 సెంటర్లలో వ్యాక్సిన్ అందజేస్తుండగా గత కొన్ని రోజులుగా చాలా కేంద్రాలు మూతపడ్డాయి. కోవిడ్ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన కింగ్ కోఠి జిల్లా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇవే కాకుండా నగరంలోని అనేక వ్యాక్సిన్ కేంద్రాలు మూత పడుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ ఎక్కడ వేయించుకోవాలో ప్రజలు అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. మే 1వ తేదీ నుండి 18ఏళ్ల వయస్సుపై బడిన యువతీ, యువకులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇందుకు కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, యాప్ ఓపెన్ కాకపోవడం, ఓపెన్ అయినా రిజిస్టర్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

వ్యాక్సిన్ నిల్వలు ఖాళీ అయ్యాయా ..?

రాష్ట్రంలో ఇటీవల వరకు ప్రతినిత్యం సుమారు లక్షన్నర మందికి టీకాలు వేస్తున్నారు. అయితే రద్ధీకి తగ్గట్లుగా వ్యాక్సిన్ కేంద్రాలు లేకపోవడంతో మరిన్ని సెంటర్‌లు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా ఉన్న సెంటర్‌లే మూత పడుతున్నాయి. వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో మూసివేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా అధికారులు దృవీకరించడం లేదు. ఎన్నికలున్న రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఎక్కువగా సరఫరా అవుతున్నాయని, ఇతర రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా వ్యాక్సిన్ ను కేంద్రం పంపడం లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

టీకా కోసం క్యూలు..

కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకాల కోసం క్యూలు కడుతున్నారు. అధికారికంగా 45 సంవత్సరాలు పై బడిన వారికి వేస్తామని ప్రకటించినా అంతకు తక్కువ వయస్సు ఉన్న వారు తమ పరపతి చూపించి టీకాలు వేయించుకుంటున్నారని, అయితే వీరికి టీకాలు వేసినట్లుగా దృవపత్రం ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో కరోనా టీకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

కోవిషీల్డ్ రెండో డోస్‌కూ తప్పని ఇక్కట్లు..

ఇటీవల వరకు కోవాక్జిన్ అందుబాటులో లేకుండా పోవడంతో రెండవ డోస్ వేయించుకునే వారు గడువు దాటి పోతోందని ఆందోళన చెందారు. తాజాగా కోవీ షీల్డ్ రెండవ డోస్ వేయించుకునే వారు కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, సెంటర్ లు మూత పడడం వంటి వారితో ఇబ్బందులు పడుతున్నారు.కొన్నిచోట్ల రెండో డోస్‌ కోసం వచ్చే వారిని వెనక్కి పంపుతున్నారు. వ్యాక్సిన్‌ స్టాక్‌ రాకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సైతం టీకా వేయడం లేదు. ప్రతినిత్యం కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వ్యాక్సిన్ కొరత నిజమే : డాక్టర్ జీ శ్రీనివాస్- డీహెచ్

రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉన్న విషయం నిజమే. రెండు రోజుల కిందట మూడు లక్షల కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి రాగా అన్ని జిల్లాలకు సరఫరా చేశాం. అవి పూర్తయితే మళ్లీ వ్యాక్సిన్ వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. ప్రజలు సంయమనం పాటించాలి. 18 నుండి 44 సంవత్సరాలలోపు వారికి వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సరఫరా అయ్యాక వేస్తారు. గతంలో వ్యాక్సిన్ సరఫరా చేసిన సెంటర్లలో తిరిగి స్టాక్ అందుబాటులోకి వచ్చాక వేస్తారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని. అవసరమైతే తప్ప బయటకు రావద్దు.



Next Story

Most Viewed