హైదరాబాద్ వారసత్వంపై కేసీఆర్ దాడి చేస్తున్నారు

by  |
హైదరాబాద్ వారసత్వంపై కేసీఆర్ దాడి చేస్తున్నారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి వారసత్వ భవనాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని, దాని పక్కనున్న 6 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రపంచ స్థాయిలో కొత్త బిల్డింగ్ నిర్మించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ఉస్మానియాను సందర్శించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా ప్రస్తుత దుస్థితికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని, 95 ఏళ్ల పురాతన ఆస్పత్రి 2014 వరకు మంచి నిర్వహణలో ఉందన్నారు. గత ఏడేళ్లలో ఉస్మానియాకు ఏడు రూపాయలు కూడా ఖర్చు చేయలేదన్నారు. హైదరాబాద్ వారసత్వం, సంస్కృతిపై సీఎం దారుణంగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 19వ శతాబ్దం మధ్యలో హైదరాబాద్ మెడికల్ స్కూల్ స్థాపనతో ప్రారంభమై ఆధునిక వైద్య విద్యకు ఉస్మానియా ప్రాతినిధ్యం వహించిందన్నారు.

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సాంకేతిక అంచనా ప్రకారం ఆస్పత్రి హెరిటేజ్ బ్లాక్ నిర్మాణాత్మకంగా స్థిరంగా ఉందని నిర్ధారణకు వచ్చిందన్నారు. కనిపించే నష్టం ఎక్కువగా భవనం యొక్క ఉపరితలంపై ఉందని, దాన్ని గుర్తించి మరమ్మతు చేయాలని, పైపులు లీకవడం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ హెరిటేజ్ భవనాన్ని కూల్చివేసేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల మురుగు నీటిని సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహి సమాధులను పునరుద్ధరించగలిగినప్పుడు, 75 ఏళ్ల ఉస్మానియా భవనాన్ని పునరుద్ధరించడం ఎందుకు సాధ్యం కాదన్నారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ విఫలం

రాష్ట్రంలో కొవిడ్ -19 పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఉత్తమ్ ఆరోపించారు. దీని ఫలితంగా సామూహిక వ్యాప్తి జరుగుతుందని, హైదరాబాద్‌లో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు చేసిన ప్రకటన రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. డాక్టర్ శ్రీనివాస్‌రావు ప్రకటన ఇచ్చిన గంటలోనే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల దానికి విరుద్ధంగా మాట్లాడారని విమర్శించారు.

Next Story