యూరియా కోసం పడిగాపులు.. రైతు ఆత్మహత్యాయత్నం

by  |
Farmers protest
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌లో రైతుల నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని ధర్పల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సొసైటీలో స్టాక్ ఉన్నా.. ఎరువులు పంపిణీ చేయడం లేదని ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రికంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు రైతును అడ్డుకొని బాటిల్ లాక్కున్నారు. దీంతో రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్ కేంద్రాలు, ప్రైవేటు దుకాణాల్లో యూరియా సరఫరా చేస్తున్నారు. అయితే జిల్లాలో ఈ సారి వర్షాలు త్వరగా కురవటంతో పంటల సాగు ముందుగానే మొదలయింది. వరినాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. జిల్లాలో ఈసారి 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు అంటే ఆగష్టు మొదటివారానికి సుమారు 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో రైతులకు సరిపడా పంపీణీ జరగటం లేదు. దీంతో పంపిణీ కేంద్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే యూరియా వస్తుండటంతో రైతులందరికీ సరఫరా కావటం లేదు. దీంతో పంపిణీకి ముందురోజు రాత్రి నుండే క్యూ లైన్లు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరినాట్లు ముమ్మరం కావటంతో ఎరువుల అవసరం తప్పనిసరి అయింది. అయితే అధికారులకు ముందుచూపు కొరవడిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరాలకు ఉపయోగించే బఫర్ స్టాక్‌ను వినియోగిస్తున్నారు. మరోపక్క యూరియా కోసం పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 4.86 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ప్రతిపాదనలు పంపారు. కరోనా కారణంగా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో ఎరువులు సకాలంలో చేరలేకపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. ఉన్న యూరియాను ఆయా సహకార సంఘాలకు పంపిణీ చేశారు. అయితే పాలక వర్గాల పెద్దలు ఎరువులను నిల్వ చేసుకోవటం, కావాల్సిన వారికి పంపిణీ చేయటం వల్ల ఎరువుల కొరత ఏడ్పడుతుంది.

జిల్లాలోని సోసైటీలు, కంపెనీ గోదాములు, మార్క్ ఫెడ్ గోదాంలు, ప్రైవేటు డీలర్లందరి వద్ద కలిపి 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ, పోటాష్, 20:20:0:15, 12:32:0 లాంటి మిశ్రమ ఎరువులన్నీ కలిపి 19 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎరువుల అమ్మకాలు జరిగాయి. అయితే అమ్మకం వివరాలు పీవోసీ యంత్రాల్లో పొందుపరచని కారణంగా గందరగోళం ఏర్పడింది. సిగ్నల్స్ రావటం లేదని, కరోనా కారణంగా వేలి ముద్రలు తీసుకోవటం లేదని, అందుకే పీవోసీ యంత్రాల్లో రికార్డ్ చేయలేకపోయామని సొసైటీలు చెబుతున్నాయి. దీనికితోడు సోసైటీ పెద్దలు ఉద్దేర బేరంతో స్టాక్ ముందుగానే తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సరుకు లేకపోయినా రికార్డులో ఉన్నట్లు కనబడుతోంది. గతేడాది కూడా రైతుల పేరు మీద వేల సంఖ్యలో బస్తాలు విక్రయించి దోచుకున్న పెద్దలు ఈ సారి కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోందని సమాచారం.


Next Story

Most Viewed