పసికందుల విక్రయం.. లేడీ డాక్టర్లు అరెస్టు

by  |
పసికందుల విక్రయం.. లేడీ డాక్టర్లు అరెస్టు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆస్పత్రి మాటున అరాచకం సాగించిన డాక్టర్ పచ్చిపాల సుమిత్రతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్నాటకలోని దావణగేరెలో డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పేదలు లక్ష్యంగా డబ్బు కోసం పసికందుల విక్రయం వైద్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశారు. మాతృత్వానికి నోచుకోని మహిళలకు వైద్యం అందించాల్సిన ఈ వైద్యురాళ్లిద్దరూ పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ముసుగులో ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఏళ్లుగా పసికందుల్ని విక్రయిస్తోంది.

దీని వివరాల్లోకి వెళ్తే… ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశాలోని గంజాం, గజపతి, రాయఘడ, కోరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల ప్రజలకు వైజాగే వైద్య రాజధాని. ఈజిల్లాల వాసులందరూ అత్యవసర వైద్యానికి వైజాగ్ వస్తారు. ఈ జిల్లాలు పేదరికానికి పెట్టింది పేరు. మెజారిటీ ప్రజలు నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు. వీరే లక్ష్యంగా సృష్టి ఆస్పత్రిపై పిల్లల అక్రమ రవాణాపై కేసు నమోదైంది. దీంతో సుమిత్ర, నమ్రతలు ఆస్పత్రి పేరుని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రిగా మార్చి దందా కొనసాగించారు.

గత నెల 24న సుందరమ్మ అనే మహిళ యూనివర్సల్ సృష్టి ఆస్పత్రిలో చైల్డ్ ట్రాఫికింగ్‌పై ఫిర్యాదు చేసింది. తన బిడ్డను కోల్‌కతాలోని దంపతులకు విక్రయించారని, తన బిడ్డను తనకు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించి, షాకయ్యారు. 2018లో నమోదైన కేసు ఈ ఆస్పత్రి, సిబ్బందిపైనేనని గుర్తించారు. ఒకసారి పట్టుబడినా మారకుండా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌గా పేరు మార్చి మళ్లీ దుర్మార్గానికి పాల్పడ్డారని గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో 8 మంది బృందంతో పచ్చిపాల సుమిత్ర, నమ్రత ఒక ముఠాను తయారు చేశారు. ఈ ముఠాపని పిల్లలు అవసరమైన డబ్బున్న వాళ్లను వెదికి పట్టుకోవడం.

వీరెంత ప్లాన్డ్‌గా పసికందుల్ని విక్రయించేవారంటే.. ఈ జిల్లాల్లో గర్భిణీల కోసం మెడికల్ క్యాంప్స్ నిర్వహించేవారు. అలా ఆశావర్కర్ల ద్వారా పేద బాలింతల వివరాలు సేకరించి, ఉచితంగా డెలివరీ చేయిస్తామంటూ విశాఖ సృష్టి ఆస్పత్రికి తరలించేవారు. అక్కడ వారికి మాయమాటలు చెప్పి వారిని ఒప్పించేవారు. డెలివరీ తర్వాత తల్లులకు కొంత మొత్తాన్ని ఇచ్చి పిల్లలు లేని ధనవంతుల దగ్గర పెద్ద మొత్తం వసూలు చేసి ఆ పసికందులను వారికి విక్రయించేవారు. అనంతరం కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే చిన్నారులు పుట్టినట్లుగా తప్పుడు బర్త్‌ సర్టిఫికెట్లు కూడా సృష్టించేవారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. వారి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరికి హైదరాబాదు, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాల్లో బ్రాంచీలు ఉండడం విశేషం. ఈమె ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టిస్తామంటూ కార్యక్రమం కూడా చేయడం విశేషం.


Next Story

Most Viewed