వ్యాక్సిన్ డీల్‌కు కేంద్రం అడుగులు

by  |
వ్యాక్సిన్ డీల్‌కు కేంద్రం అడుగులు
X

న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం కంపెనీలతో డీల్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వ్యాక్సిన్ సక్సెస్‌కు ముందే ప్రీ ప్రొడక్షన్ డీల్ కోసం చర్చలు ప్రారంభించింది. టీకా విజయవంతమైతే పెద్దమొత్తంలో వాటిని ఉత్పత్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది? వ్యాక్సిన్ ఆమోదితమైతే దాదాపుగా ధర ఎంత నిర్ణయించే అవకాశమున్నది? లాంటి విషయాలను ముందస్తు అంచనా కోసం సేకరిస్తున్నది.

ఇందులో భాగంగానే సోమవారం ఐదు కంపెనీలతో కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ భేటీ అయింది. ఇందులో టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్, జైదుస్ కాడిలా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతోపాటు వ్యాక్సిన్ ఇంకా ప్రీ క్లినికల్ దశల్లోనే ఉన్న బయలాజికల్ ఈ, జినోవా సంస్థలున్నాయి. యూఎస్, యూకే సహా పలుదేశాలు టీకా విజయవంతమవడానికి ముందే కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే శాస్త్రజ్ఞులు ఒకవైపు కరోనా టీకా కోసం పరిశోధనలు జరుపుతుండగానే, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ముందుగానే వాటిని సమకూర్చుకునే ఏర్పాట్లపై ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. టీకా తయారీదారులతో నిపుణుల కమిటీ చర్చలు జరుపుతున్నదని, వ్యాక్సిన్ విజయవంతమవగానే దాని ఉత్పత్తికి, పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించింది. తొలుత 68 కోట్ల డోసులు అవసరమవుతాయని కొన్ని నెలల క్రితం అంచనా వేసినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.

ముందుగా 18 నుంచి 65ఏళ్ల వారికి ఈ డోసులు ఇచ్చే అవకాశముందని, అయితే, ఏ విషయంపైనా ఇంకా తుదినిర్ణయం ఖరారు కాలేదని వివరించారు. నీతి అయోగ్ (హెల్త్)సభ్యులు వీకే పౌల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ల నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్యానెల్‌లో బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఫార్మస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి పీడీ వాఘేలా ఉన్నారు.

Next Story

Most Viewed