‘భారత్‌లో ఆ క్లాజ్‌ను అదే రీతిలో అమలు చేయడం లేదు’

by  |
‘భారత్‌లో ఆ క్లాజ్‌ను అదే రీతిలో అమలు చేయడం లేదు’
X

న్యూఢిల్లీ: భారతీయ యూజర్ల వినియోగాన్ని ఇతర అవసరాలకు వాడుకునేలా నూతన ప్రైవసీ పాలసీని వాట్సాప్ రూపొందించిందని, అదే యూరప్‌లో ఇందుకు భిన్నమైన నిబంధనలున్నాయని ఢిల్లీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. యూరోపియన్ యూజర్ల కోసం వాట్సాప్ పాలసీలో వినియోగదారుల సమాచారాన్ని ఇతర అవసరాలకు వాడకుండా నిషేధమున్నదని వివరించింది. కానీ, భారత్‌లో ఈ క్లాజును అదే రీతిలో అమలు చేయడం లేదని పేర్కొంది.

యూరప్ చట్టాలకు అనుకూలంగా అక్కడ పాలసీని రూపొందించుకుందని, ఇక్కడ మాత్రం భారతీయ యూజర్ల డేటాను ఇతరత్రాలకు వినియోగించుకోవాలని చూస్తున్నదని ఆరోపించింది. ఈ నిబంధన ఏకపక్షంగా నిర్ణయించారని, కనీసం ఆ నిబంధనను వద్దనుకునే స్వేచ్ఛ కూడా భారతీయ యూజర్లకు కల్పించలేదని వివరించింది. వాట్సాప్‌కు పెద్దమొత్తంలో యూజర్లు గల భారత్‌లో ఇలాంటి పాలసీని అమలు చేయాలనుకోవడం తగదని అభిప్రాయపడింది. తమ ఆందోళనలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను వాట్సాప్‌ సంస్థకు పంపించామని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వివరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారంతో గందరగోళానికి గురవుతోందని వాట్సాప్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.

ప్రభుత్వం పంపిన సందేహాలను పరిగణనలోకి తీసుకున్నామని, వారికి సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈ విచారణను న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవా మార్చి 1కి వాయిదా వేశారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తున్నదని, తమ సమాచారాన్ని ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీ కంపెనీలతో పంచుకోవద్దని యూజర్లు ఎంచుకునే వెసులుబాటునూ కల్పించలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారిస్తున్నది


Next Story