ఆ విషయంలో తెలంగాణా భేష్ అంటున్న కేంద్రమంత్రి..

by  |
agriculture minister
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ద్వారానే రైతు ఆధాయం రెట్టింపు అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. పంట సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించి, వరి ధాన్యం, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతామని సూచించారు. సోమవారం హైదరాబాద్ లో పర్యటించిన ఆమె బీఆర్ కేఆర్ భవన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ప్రణాళికలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీ విషయాన్ని పరిశీలిస్తామని త్వరలోనే నిర్ణయాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.

అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు పరిశ్రమల అధికారులతో కలిసి ఒక బృందంగా ఏర్పడలన్నారు. దేశంలో మనం పండించిన పంటలు అధికశాతం దేశ అవసారాలకే పరిమితం అవుతున్నాయని తెలిపారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన పంటలను పండించాల్సిన అవసరముందన్నారు.ఈ దిశగా రైతులు దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు రైతులను చైతన్యం చేయాలని తెలిపారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతో పాటు పప్పుగింజల సాగుకు కేంద్రం నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి రాష్ట్రం స్వయం సంవృద్ది దిశగా అడుగులు వేయాలి డిజిటలైజేషన్ కు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేసి అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలని విన్నవించారు. ఎఫ్ సీ ఐ నిర్ణయం రైతాంగానికి గొడ్డలిపెట్టలాంటదని అర్ధంతరంగా కొనుగోళ్లు చేయమని చెప్పడం ద్వారా రైతాంగం ఆందోళనకు గురవుతుందని వివరించారు. వరి సాగు నుండి నూనె, పప్పుగింజలు, ఆయిల్ పామ్ సాగు వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నదని పేర్కొన్నారు. 2020-21 రెండు సీజన్లు కలిపి 141.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎఫ్ సీ ఐ ద్వారా సేకరించి తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

పంటల మార్చిడి అనేది నిరంతర ప్రక్రియని దానిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఒకేసారి ఆకస్మికంగా రైతులు ఇతర పంటలకు మళ్లడం అనేది కష్టతరం .. కావున దొడ్డు వడ్లను సేకరించం అనే ఎఫ్ సీ ఐ నిర్ణయం వాయిదా వేయాలని కోరారు. రూ.15 వేల కోట్లతో రైతుబంధు, రూ.1,440 కోట్లు రైతుభీమా, రూ.25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులు, రూ.10 వేల కోట్లతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా, పంటల కొనుగోళ్లు ఇలా దాదాపు రూ.55 వేల కోట్ల నుండి రూ.60 వేల కోట్లు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తుందని వివరించారు.

రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 2013 – 14 లో 13.8 శాతం నుండి 2019 – 20కి 19.3 శాతం, 2020 – 21కి 20.90 శాతానికి పెంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2013 – 14 లో రూ.1.12 లక్షల నుండి 2019 – 20 కి 103 శాతం వృద్దితో రూ.2.28 లక్షలకు చేరుకుని దేశంలో 14 వ స్థానం నుండి 5 స్థానానికి చేరుకున్నదని చెప్పారు. తెలంగాణ మామిడికాయకు అంతర్జాతీయ ప్రసిద్ది ఉన్నప్పటికి కేంద్రం నుండి తగినంత సహకారం లేదని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును అత్యంత ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళుతున్నదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ కు వంద శాతం రాయితీపై నిధులను కేటాయించాలని కోరారు. వంటనూనెల దిగుమతుల మీద ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ద్వారా ఆ ఖర్చును తగ్గించవచ్చని తెలిపారు. వ్యవసాయరంగంలోఅధిక ప్రాధాన్యం ఇచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యతనిచ్చి అధిక నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రాల అవసరాలు, వ్యవసాయ పథకాల ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా కేంద్రం నుండి నిధులు కేటాయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోమిత బిశ్వాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి హన్మంతు కొండిబ, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్,ఎండీ టీఎస్ కాబ్ డాక్టర్ మురళీధర్, డీజీ మేనేజ్ డాక్టర్ చంద్రశేఖర, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విలాస్ ఎ టొనాపి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి , తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, ఉద్యాన సంచాలకులు వెంకట్రాం రెడ్డిలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed