కొవిడ్ సమయంలోనూ నిరంతర విద్యుత్

by  |
కొవిడ్ సమయంలోనూ నిరంతర విద్యుత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ విపత్కర సమయంలోనూ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నామని టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం విద్యుత్ సౌధలో జేఎండీలు, డైరెక్టర్లతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకోవాలని, అందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సమస్యలపై పరిష్కారానికి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే జెన్ కో, ట్రాన్స్ కోలోని ఆయా కార్యాలయాల్లో సైతం కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని జోనల్, సర్కిల్ హెడ్లను సీఎండీ ఆదేశించారు.

విద్యుత్ ఉద్యోగులు వారి కుటుంబ సంక్షేమం కోసం అందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రానున్న రెండు నెలలు మే, జూన్ లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావుతో కూడా ప్రభాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రధాన కార్యాలయంలో వైద్య శాఖ సహకారంతో వాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed