నిరుద్యోగమే ఆ రాష్ట్రానికి అతిపెద్ద క్వాలిఫికేషన్!

by  |
నిరుద్యోగమే ఆ రాష్ట్రానికి అతిపెద్ద క్వాలిఫికేషన్!
X

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అని పాత సామెత. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అలానే ఉంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఏడూ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వైశాల్యపరంగా 5వ పెద్ద రాష్ట్రమైనప్పటికీ ఆ వైశాల్యం నిండా చదువుకున్న నిరుద్యోగులతో నింపే ప్రయత్నాల్లో ఉంది అక్కడి ప్రభుత్వం. చరిత్ర అనేంత దూరం వెళ్లకుండా గడిచిన రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే గత రెండేళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 12.5 లక్షలకుపైగా విద్యావంతులైన యువకులు ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య 34 లక్షలు. ఈ గణాంకాలు ఎవరో బయటి వ్యక్తులు, సంస్థలు చెప్పినవి కావు, సాక్షాత్తు 2017లో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే ఈ నెల 14న రాష్ట్ర అసెంబ్లీలో గొంతు సవరించి మరీ చెప్పుకున్నది.

2020 ఫిబ్రవరి 7 నాటికి రాష్ట్రంలో 33.93 లక్షల మంది నిరుద్యోగులున్నట్టు ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసింది. ఈ విషయాన్ని యూపీ కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాష్ట్ర అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018, జూన్ 30 నాటికి యూపీలో నమోదైన విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య 21.39 లక్షలు. అంటే, గడిచిన రెండేళ్లలో ఆ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 58.43 శాతం పెరిగింది. సగానికి పైగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని చెప్పిన కార్మిక మంత్రి, దానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ మనదేశంలో సుమారు 20 కోట్ల మంది జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది. అంటే దేశ జనాభాలో 16 శాతం మంది జనాభా ఆ రాష్ట్రంలో ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ) గణాంకాల ప్రకారం… 2018తో పోలిస్తే 2019లో యూపీలో నిరుద్యోగం రెట్టింపుస్థాయిలో పెరిగింది. యూపీలో సగటు నిరుద్యోగం గతేడాది 9.95 శాతానికి పెరిగింది. అంటే, ప్రతి 100 మందిలో సుమారు 10 మంది నిరుద్యోగులు ఉన్నట్టు. అంతకుముందు 2018లో సగటు నిరుద్యోగం 5.91 శాతంగా ఉండేది. ప్రాథమిక అంచనాల ప్రకారం… దేశంలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం వల్ల యూపీలో నిరుద్యోగితరేటు జాతీయ సగటురేటు 7.7% కన్నా అత్యధికంగా ఉంది. జాతీయసగటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠస్థాయి 4.5 శాతానికి పడిపోయింది. దేశస్థూల జాతీయోత్పత్తి వృద్ధి(జీడీపీ) కేవలం సంవత్సర కాలంలో 2 శాతానికిపైగా దిగజారింది.

Next Story