ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్‌ కాలుష్యం తగ్గింది!

by Ramesh N |   ( Updated:2024-05-16 10:12:23.0  )
ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్‌ కాలుష్యం తగ్గింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణకు చెందిన ఓటర్లు చాలా మంది రెండు, మూడు రోజుల ముందుగానే హైదరాబాద్ వదిలి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో మే 13న హైదరాబాద్‌లో కాలుష్యం భారీగా తగ్గింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు విడుదల చేసింది. మే 11 వ తేదీన గాలిలో పార్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం)-2.5 సూక్ష్మకణాలు క్యూబిక్‌ మీటర్‌కు 45 మైక్రోగ్రాములు కాగా, పోలింగ్‌కు ముందు రోజు 22, పోలింగ్‌ రోజున 21, మరుసటి రోజు 48 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా గణాంకాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే పార్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం)- 10 సూక్ష్మకణాలు మే 11న క్యూబిక్‌ మీటర్‌కు 130 మైక్రోగ్రాములు కాగా, మే 12న 44, మే 13న 41, మే 14న 80 మైక్రోగ్రాములు ఉన్నది. ఇంధనం కాల్చడం వల్ల వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువు నైట్ర స్‌ ఆక్సైడ్‌ మే 11న క్యూబిక్‌ మీటర్‌కు 30.3 మైక్రోగ్రాములు ఉండగా, మే 12న 25.9, మే 13న 27.4, మే 14 25.7 మైక్రోగ్రాములు ఉన్నది. సాధారణ రోజుల్లో నగరంలో రోజుకు పీఎం 2.5 సూక్ష్మకణాలు క్యూబిక్‌ మీటర్‌కు 60, పీఎం 10 సూక్ష్మకణాలు క్యూబిక్‌ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Next Story