2021లో 'బలమైన రికవరీ' దిశగా భారత్!

by  |
2021లో బలమైన రికవరీ దిశగా భారత్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో భారత ఆర్థికవ్యవస్థ 6.9 శాతం కుదించుకుపోవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే, 2021లో ‘బలంగా కోలుకోవడం’ ద్వారా 5 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) తాజా నివేదిక ప్రకారం..2020లో కేంద్రం వెల్లడించిన ఉద్దీపన ప్రకటించిన స్థాయిలో అమలు కాలేదని, దీనివల్ల ఊహించిన దానికంటే తక్కువ ఆర్థిక పనితీరుకు దారితీసిందని వెల్లడించింది. ఇక, ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌ డిమాండ్‌ను సృష్టించే దిశగా ఉందని, అలాగే, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదలతో ఈ ఏడాది సానుకూలంగా ఉండొచ్చని తెలిపింది.

సరఫరావైపు అడ్డంకులను తగ్గించడం, మొత్తం డిమాండ్ మద్దతు కంటే ద్రవ్య మద్దతును అందించడంపై భారత్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 2021లో 5 శాతం వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. గతేడాది ఊహించిన దానికంటే ఎక్కువ పతనం ఈ ఏడాది బలమైన రికవరీకి కారణమని వివరించింది. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో డిమాండ్ వైపు దృష్టి సారించడం, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల వృద్ధికి కలిసిరానుంది. ముఖ్యంగా రవాణా మౌలికసదుపాయాలతో ప్రపంచ ఎగుమతి రంగం 2021లో వృద్ధి సాధించడానికి సహాయపడుతుందని నివేదిక అభిప్రాయపడింది.

ప్రపంచ ఆర్థికవ్యవస్థ..

ఈ ఏడాది ప్రపంచ ఆర్థికవ్యవస్థ 4.7 శాతం వృద్ధి చెందుతుందని, ఇది గతేడాది సెప్టెంబర్‌లో అంచనా వేసిన 4.3 శాతం కంటే మెరుగ్గా ఉంటుందని యూఎన్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడం, అమెరికా 1.9 ట్రిలియన్ల తాజా ఆర్థిక ఉద్దీపన వినియోగ వ్యయాన్ని పెంచుతుందని, తద్వారా అమెరికా బలమైన రికవరీ భాగస్వామ్యం కలిగి ఉంటుందని వెల్లడించింది.


Next Story