డీఆర్ఎస్‌కు వెళ్లకుండా తన నిర్ణయాన్నే మార్చుకున్న అంపైర్

by  |
డీఆర్ఎస్‌కు వెళ్లకుండా తన నిర్ణయాన్నే మార్చుకున్న అంపైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ లేదా అంతర్జాతీయ మ్యాచ్ ఏదైనా సరే అంపైర్ నిర్ణయమే కీలకం. ఒక వేళ అంపైర్ నిర్ణయంతో ఏకీభావం లేకపోతే డీఆర్ఎస్ (ఆ మ్యాచ్‌లో సౌకర్యం ఉంటే) ఉపయోగించుకోవచ్చు. కానీ మనం ఎప్పుడూ చూడని విధంగా తొలి సారిగా అంపైర్ తన నిర్ణయాన్ని సెకెన్ల వ్యవధిలో మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇది చోటు చేసుకున్నది. మార్ష్ కప్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియాకు మధ్య ఒక మ్యాచ్ మంగళవారం జరిగింది. సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్నర్ పీటర్ హట్జోగ్లూ వేసిన బంతి వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ సామ్ వైట్‌మాన్ ఆడబోయి ఎడ్జ్ చేసినట్లు భావించారు.

కీపర్ క్యాచ్ చేసిన వెంటనే సౌత్ ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు బౌలర్ పీటర్ కూడా అప్పీల్ చేశాడు. ఆ సమయంలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన డోనోవాన్ కోచ్ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో బ్యాట్స్‌మాన్ సామ్ వైట్‌మాన్ పెవీలియన్ వైపు నడక ప్రారంభించాడు. తనకు లిస్ట్-ఏలో తొలి వికెట్ లభించిందని బౌలర్ పీటర్ కూడా సంబురాల్లో మునిగిపోయాడు. కానీ 10 సెకన్లలో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని అది నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో మైదానంలోని క్రికెటర్లందరూ అవాక్కయ్యారు. అంతే కాదు.. ఆ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న బ్రెట్ లీ, స్టువర్ట్ క్లార్క్ కూడా తాము ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాగా, రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. అంపైర్ తన నిర్ణయం మార్చుకోవడం సరైనదేనని తేలింది.


Next Story

Most Viewed