రెండోదశ పోలింగ్ లో హీట్ వేవ్ ఎఫెక్ట్.. కేరళలో నలుగురు మృతి

by Dishanational6 |
రెండోదశ పోలింగ్ లో హీట్ వేవ్ ఎఫెక్ట్.. కేరళలో నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ వేళ.. కేరళలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు కుప్పకూలి మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు ఓటర్లు కాగా, ఒకరు పోలింగ్ ఏజెంట్ అని కథనాలు వెలువడ్డాయి. కేరళలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

అయితే, పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల వ్యక్తి ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా.. హాస్పిటల్ కు వెళ్లేలోగానే వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు వైద్యులు. ఒట్టపాలెంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. 39 శాతం తేమ నమోదైంది.

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కోజికోడ్ టౌన్ లోని బూత్ నంబర్ 16లో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ, హాస్పిటల్ వెళ్లే సరికే అనీస్ అహ్మద్ చనిపోయారు. కోజికోడ్ లో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. 61 శాతం తేమ ఉంది.

మలప్పురం జిల్లా తిరూర్‌లో, 63 ఏళ్ల మదర్సా టీచర్ ఎన్నికల్లో ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే తిరూర్ లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. 60 శాతం తేమస్థాయి నమోదైంది. అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటు వేసి ఇంటికి వచ్చిన వెంటనే చనిపోయాడు. అంబలప్పుజలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. 68 శాతం తేమ ఉంది.

కేరళలోని మొత్తం 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోటే చేస్తున్నారు. అంతేకుకండా ఇద్దరు కేంద్రమంత్రి కూడా కేరళ నుంచే బరిలో ఉన్నారు. కేంద్రమంత్రి వి మురళీధరన్.. అట్టింగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ కూడా బరిలో ఉన్నారు.



Next Story