గడువుతో.. బేరసారాలకు అవకాశం: సుప్రీం

by  |
గడువుతో.. బేరసారాలకు అవకాశం: సుప్రీం
X

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు ఆదేశాలివ్వాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి.. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం నిన్న(బుధవారం) ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి రెండు వారాల గడువు కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది నేడు(గురువారం) విజ్ఞప్తి చేశారు. వారాలకు వారాలు గడువు ఇవ్వడమంటే.. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం కల్పించినట్టే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉండదని స్పీకర్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకుంటే.. అసెంబ్లీని వాయిదా వేస్తుంటే.. స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించరాదా? అలాగైతే.. మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించినట్టవుతుందని తెలిపింది.

రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వచ్చి రాజీనామా లేఖలను సమర్పిస్తేనే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు వారాల గడువు ఇస్తే రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి భోపాల్ వచ్చాకే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ తరఫు న్యాయవాది సింఘ్వీ తెలుపగా.. స్పీకర్ ముందు హాజరు కావాలని రెబల్ ఎమ్మెల్యేలను కోర్టు ఒత్తిడి చేయలేదని ధర్మాసనం పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేలు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే వాతావరణాన్ని కల్పించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించాక స్పీకర్ నిర్ణయం తీసుకునే ప్రతిపాదనను ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. కానీ, ఈ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. అయితే, స్పీకర్‌కు రెండు వారాల గడువు ఇస్తే.. అది ఎమ్మెల్యేల బేరసారానికి తెరలేపినట్టవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

tags : supreme court, madhya pradesh, rebel mlas, speaker, governor, justice dy chandrachud

Next Story

Most Viewed