వరంగల్‌ 'కుడా'లో రెచ్చిపోతున్న ఆ ఇద్దరు.. తెరవెనుక మంత్రి సపోర్ట్??

by  |
warangal kuda
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లో ఓ ఇద్ద‌రు అధికారులు తోడు దొంగ‌ల్లా అందిన‌కాడికి దండుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అభివృద్ధి ప‌నుల్లో అక్ర‌మాలు, కాంట్రాక్ట‌ర్ల నుంచి క‌మీష‌న్లు, అనుమ‌తుల‌కు మాముళ్లు పుచ్చుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. అక్రమార్జ‌న అనేది ఈ ఇద్ద‌రు అధికారులు హ‌క్కుగా భావిస్తుంటార‌ని స‌మాచారం. ఫైల్‌కో రేటు ఫిక్స్ అత్యంత న‌మ్మ‌క‌స్తులు, ఒక‌రిద్ద‌రు కిందిస్థాయి అధికారుల నుంచి కార్పోరేట‌ర్లు, ఎమ్మెల్యేల‌కు స‌న్నిహితులుగా చెలామ‌ణి అవుతున్న వారి వ‌ద్ద నుంచే వీరు దందా కొన‌సాగిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న కుడాను సొంత దుకాణంలో మార్చేసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కుడా పాల‌క వ‌ర్గం పెద్ద‌ల‌కు ఈ ఇద్ద‌రి దందా తెలిసినా నోరు మెద‌ప‌క‌పోవ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఇద్దరి దందాకు పాల‌క‌వ‌ర్గంలోని స‌భ్యులే వార‌ధులుగా నిలుస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. కుడాలో ఏం జ‌ర‌గ‌ల‌న్నా వీరి వ‌ద్ద లొంగిపోవ‌డం త‌ప్ప.. వేరే మార్గం లేద‌న్న బ‌ల‌మైన అభిప్రాయం వ‌రంగ‌ల్ రియ‌ల్ ఎస్టేట్, కాంట్రాక్ట‌ర్‌ వ‌ర్గాల్లో నెలకొని ఉందంటే కార్యాల‌యంలో వారి హ‌వా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

దొంగ‌ల‌కు స‌ద్దిక‌డుతున్న ఇద్ద‌రు…

అన్ని అర్హ‌తలున్నా ఫైల్‌ క్లియ‌రెన్స్‌కు మాత్రం కొర్రీలు పెట్ట‌డంలో ఇద్ద‌రు అధికారులు సిద్ధ‌హ‌స్తుల‌ని స‌మాచారం. ప‌నులు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం లేద‌ని గ‌తంలో ఓ ఐఏఎస్ అధికారి కొంత‌మంది కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్టులో పెట్టించారు. ఆ అధికారి వెళ్లిపోయాక బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్ట‌ర్ల‌కే ప‌నులు ద‌క్కేలా చేయ‌డంలో ఇద్ద‌రు కుడా అధికారులు చ‌క్రం తిప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్ట‌ర్ కొద్దిరోజుల క్రితం రూ.2కోట్లతో కుడా ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న ప‌నుల‌ను ద‌క్కించుకున్నాడు. ఆ ప‌నులు నాణ్య‌త లేకుండా సాగుతున్నాయ‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చిన ప‌ట్టించుకోలేదు. ఈ తతంగ‌మంతా చూస్తున్న ప్ర‌జ‌లు కుడా అధికారులు దొంగ‌ల‌కు స‌ద్ది క‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఏళ్ల‌కు ఏళ్లు కుర్చీలో క‌ర్చీఫ్ వేసుకుని…

రాజ‌కీయ అండ‌దండ‌ల‌తో ఉద్యోగ‌ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏళ్లుగా ఒకే పోస్టులో ఆ ఇద్ద‌రు అధికారులు కుడాలో తిష్ట‌వేస్తున్నారు. గ‌తంలో వారి అక్ర‌మాల‌ను గుర్తించి పై అధికారుల‌కు రిపోర్ట్ చేసిన ఉన్న‌తాధికారినే ట్రాన్స్ఫ‌ర్ ఆర్డ‌ర్ చేతిలో పెట్టించిన ఘ‌నులని కుడా సిబ్బంది పేర్కొంటున్నారు. పనుల్లో నాణ్య‌త లేద‌ని, ప‌ర్యవేక్షించ‌కుండా ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించిన ఓ ఉన్న‌తాధికారి ట్రాన్స్‌ఫ‌ర్ విష‌యంలోనూ వీరి ఇద్ద‌రి ప్ర‌మేయం ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఆదాయానికి మించి కోట్ల రూపాయ‌ల ధ‌నం కూడ‌బెట్టుకున్న‌ట్లుగా అనేక ఆరోప‌ణ‌లు ఉన్న ఈ ఇద్ద‌రిపై ఏసీబీ గాని, ఆదాయ ప‌న్ను శాఖ అధికారులుగాని దృష్టి సారించ‌క‌పోవ‌డంతో విస్తుగొల్పుతోంద‌ని సొంత కార్యాల‌య సిబ్బందే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఆ మంత్రి అండ‌దండ‌ల‌తోనే…

రాష్ట్ర ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న ఒక‌రిద్ద‌రు నేత‌ల అండ‌దండ‌లతోనే కుడాను ఇద్ద‌రు అధికారులు ఏలేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ నేత‌ల ప‌నులు చ‌క్క‌బెడుతూ వారితో ఇబ్బంది క‌ల‌గ‌కుండా చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంలో కీల‌క స్థానంలో ఉన్న ఓ మంత్రి అండ‌దండ‌ల‌తో స్థానిక ఎమ్మెల్యేల ఆదేశాలు ప‌ట్టించుకోర‌ని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యే త‌న అనుచ‌రుడు చేసిన వెంచ‌ర్‌కు అనుమ‌తులివ్వాల‌ని కోర‌గా ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. దీంతో అహం దెబ్బ తిన్న ఎమ్మెల్యే ఓ మంత్రికి ఫోన్ చేసి వివరించ‌గా… మ‌న‌మేం చేయ‌లేం.. గ‌మ్మున ఉండు అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చినట్లుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Next Story

Most Viewed