ఆ కార్పొరేషన్‌ కోసం స్టీరింగ్‌ తిప్పుతోన్న కారు?

by  |
ఆ కార్పొరేషన్‌ కోసం స్టీరింగ్‌ తిప్పుతోన్న కారు?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు శంఖా‌రావం మోగ‌నున్న‌ట్లుగా అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం. ఈ కార్పొరేష‌న్‌కు డిసెంబ‌ర్ చివ‌రి వారంలో గాని, జ‌న‌వ‌రి మొద‌టి వారంలో గాని ఎన్నిక‌లు జ‌రగ‌నున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నిక‌ల త‌ర్వాత వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని అభివృద్ధి ప‌నుల‌ను సాధ్య‌మైనంత వేగంగా ప్రారంభించి ఎన్నిక‌ల బరిలో దిగేందుకు కారు నేతలు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు డిసెంబర్ 2వ తేదీన మున్సిపల్, ఐటీ శాఖ‌ల మంత్రి కేటీఆర్‌తో పాటు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిల జిల్లా ప‌ర్య‌ట‌న మరింత ప్రాధాన్యతను సంత‌రించుకోనుంది. వీరి పర్యటన ప్రకటన వెలువడడంతో కారు స్టీరింగ్ గ్రేటర్‌ నుంచి నేరుగా ఖమ్మం వైపు తిరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల ముందు నుంచే..

ఖమ్మంలో దాదాపు మూడు నెల‌ల ముందు నుంచే అధికార పార్టీలో కార్పొరేష‌న్ ఎన్నిక‌లకు సంబంధించిన హ‌డావుడి క‌నిపిస్తోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వ‌చ్చాక ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి, పూర్త‌యిన‌వి, పూర్తి కావాల్సిన ప‌నుల‌ను ప్రజా‌క్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో అందుతున్న మెరుగైన పౌరసేవ‌లు, ప‌ట్ట‌ణంలో జ‌రిగిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని స్థానిక కార్పొరేట‌ర్ల‌కు మంత్రుల ద్వారా అధిష్టానం సూచనలు చేస్తునే ఉందని ప్రచారం జరుగుతోంది.

పువ్వాడ అజయ్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం..

ఇక, ఖ‌మ్మం కార్పొరేష‌న్ ప‌రిధి అంతా కూడా ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. దీంతో ఈ ఎన్నిక‌లు మంత్రికి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌నున్నాయి. గ‌తంలో కేటీఆర్ చేయించిన స‌ర్వేలో కొంత‌మంది కార్పొరేట‌ర్ల ప‌నితీరు సరిగ్గాలేదని తేల‌డంతో తీరు మార్చుకోవాల‌ని మంత్రి హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే, డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత‌మున్న 50కి అద‌నంగా మ‌రో 10 డివిజ‌న్లు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో మరో 10 మంది అధికార పార్టీ నేతలకు పోటీ చేసేందుకు అవకాశం వస్తోందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

గ్రేటర్‌ ఎఫెక్ట్‌ ఖమ్మంలో కూడా?

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పార్టీ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఖ‌మ్మం కార్పొరేట‌ర్లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. టికెట్ల కేటాయింపు విష‌యంలో అధిష్ఠానం అవ‌లంభిస్తున్న విధానం పై చర్చించుకుంటున్నారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో తొలి జాబితాలో చాలామంది సిట్టింగ్‌ల‌కే సీట్లు కేటాయిస్తూ అధినేత కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో, ఖ‌మ్మంలో కూడా అదే విధానాన్ని పార్టీ అనుస‌రిస్తుంద‌ని చాలా మంది కార్పొరేట‌ర్ల‌లో విశ్వాసం పెరిగింది. పార్టీ వైఖ‌రి త‌మ‌కు అనుకూలంగా ఉంద‌నుకుంటున్న కార్పొరేట‌ర్లు కాస్త ధీమాగా ఉండ‌వ‌చ్చు అంటూ స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్య‌ానిస్తున్నారంట‌. మ‌రి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో… ఆ ఫ‌లితాల ప్ర‌భావం ఖ‌మ్మం టీఆర్ఎస్‌పై ఏవిధంగా ఉండ‌బోతోందో అన్న అంశం కూడా మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇక వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Next Story

Most Viewed