రాయలసీమ ఎత్తిపోతలపై టీఆర్ఎస్ కౌంటర్

by  |
రాయలసీమ ఎత్తిపోతలపై టీఆర్ఎస్ కౌంటర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇంతకాలం రెండు రాష్ట్రాల మధ్య జలవివాదంగా ఉంటే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫోకస్ పాయింట్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుపై టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని, ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చడంకోసం దక్షిణ తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై పాలమూరు జిల్లా టీఆర్ఎస్ నేతలుగా ఘాటుగానే మండిపడ్డారు. ఆర్డీఎస్‌కు, ఆర్డీఎక్స్‌కు తేడా తెలియని కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ కమిట్‌మెంట్‌పై కామెంట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు పోతిరెడ్డిపాడు, రాయలసీమ విషయంలో సీఎం కేసీఆర్‌ను తప్పుపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాసగౌడ్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆనాడు పీజేఆర్‌ ఒక్కరే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించారని, కనీసం ఆ విషయంలో ఆయనకు మద్దతు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దని వారిస్తున్నా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే కాంగ్రెస్ నేతలు ఇంప్లీడ్ కావొచ్చని, కానీ రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

ఏపీ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేస్తామని, దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని స్పష్టంచేశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచినందువల్లనే గతంలో వైఎస్సార్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చిందని గుర్తుచేశారు. టీఎంసీ అంటే తెలియని నేతలు కూడా కృష్ణా జలాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అపెక్స్ కమిటీ కంటే ముందే సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లోనే సుప్రీంకోర్టు నుంచి అదేశాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఏపీ వినకపోతే ఎం చేయాలో తమకు బాగా తెలుసని, చెప్పింది చేసి చూపిస్తామన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు అయోమయానికి గురై అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నారని, ముందుగా పిటిషన్ కాపీని పూర్తిగా చదవాలని సూచించారు. నిజానికి కాంగ్రెస్ కారణంగానే ప్రాజెక్టులు జాప్యం అవుతున్నాయని, ఆర్డీఎస్‌కు ఆర్డీఎక్స్‌కు తెలియని కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్‌పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరును ఎండబెట్టిన కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ మొసలి కన్నీరు కారుస్తున్నారని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు పాపం కాంగ్రెస్‌దేనని, గతంలో సమైక్యవాదుల మోచేతి నీళ్లు తాగిన కాంగ్రెస్ నేతలు, బీజేపీలో చేరిన నేతలు సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు.



Next Story

Most Viewed