ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు

by  |
mla-reGHA-1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రాఫ్ పడిపోయిందని నియోజకవర్గ నిఘా వర్గాలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో రేగా పరిపాలన సరైనవిధంగా లేదని, భారీ వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రేగాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి పేరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పిన రేగా నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసిన ఉత్సాహం టీఆర్ఎస్ పార్టీలో లేదని, తన లాభార్జన కోసమే పార్టీ మారారని ప్రజలు అంటున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేయడంలేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని అందుకే రేగా గ్రాఫ్ పడిపోయిందని నిఘావర్గాలు, పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే పేరుతో దందాలు

ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారారో ఆయనకు వ్యక్తిగతంగా దెబ్బపడిందని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా పేరు చెప్పి కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు భూదందా, ఇసుకదందా, సెటిల్ మెంట్ల దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. వారు ఎంతో మంది పేద ప్రజల భూములు కబ్జా చేశారని మండిపడుతున్నారు. ఈ దందాలు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేయించారా…లేక కార్యకర్తలే చేశారా అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా మొత్తంగా తన వెంట ఉండే కార్యకర్తల వల్లే ఎమ్మెల్యే రేగాకు చెడ్డ పేరు వస్తున్నట్లు తెలుస్తోంది.

భయంతో చస్తున్నాం..

నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులు స్వేచ్ఛగా ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏ అధికారైనా కార్యకర్తల పని చేయకపోతే ఎమ్మెల్యే రేగాతో చెప్పి ట్రాన్స్ఫర్ చేయిస్తారనే భయం ప్రభుత్వాధికారుల్లో ఏర్పడింది. సాధ్యపడని పనులు కూడా చేయించుకుంటున్నారని, అదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కార్యకర్తలు ప్రభుత్వ భూములు కబ్జా చేసి వాటిని తమ పేరు మీద మార్చుకోవడం కోసం అధికారులను నానా ఇబ్బందులు పెట్టినట్లు సమాచారం. పని చేయకపోతే ఎమ్మెల్యే రేగాతో చెప్పించి పనులు చేయించుకున్నారని కొందరు అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పనిచేస్తే ఉద్యోగాలు పోతాయనే భయం… చేయకపోతే ట్రాన్స్ ఫర్ చేయిస్తారనే భయంతో చస్తున్నాం’ అని కొందరు అధికారులు వాపోతున్నారు.

ఇప్పటికైనా దృష్టి సారించాలి

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయననే గెలిపిస్తారనే మాట కూడా జోరుగానే వినిపిస్తోంది. అయితే… ముఖ్యంగా రేగా తన ప్రక్కన ఉన్న కొంతమంది కార్యకర్తలను దూరం పెట్టకపోతే ఆయన రాజకీయ జీవితానికి చెక్ పడే అవకాశం మెండుగా ఉందని పలువురు మేధావులు చెబుతున్నారు. భూ దందాలు, ఇసుక దందాలు చేస్తున్నవారిని రేగా పార్టీ నుంచి బహిష్కరించకపోతే పార్టీ మనుగడను కోల్పోతుందని ప్రజలు, పలువురు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టి సారించి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలని, సమస్యలను తీర్చాలని పలువురు మేధావులు కోరుతున్నారు.



Next Story

Most Viewed