ప్రైవసీ గుబులు.. అంతా వాట్సప్ కాల్స్ మయం

by  |
ప్రైవసీ గుబులు.. అంతా వాట్సప్ కాల్స్ మయం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేస్తున్న ఈటల రాజేందర్ ఆరోపణల పర్వంతో రెగ్యూలర్ కాల్స్ కు బ్రేక్ పడింది. ప్రతి ఒక్కరూ వాట్సప్ కాల్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలాంటి అంశమైన ఇకనుండి వాట్సప్ ద్వారానే మాట్లాడుకోవాలని భావిస్తున్నారట నాయకులు. దీంతో ఎదుటి వ్యక్తి కాల్ రికార్డింగ్ చేసే అవకాశం ఉండకపోవడంతో పాటు నిఘా వర్గాలకు కాల్స్ రికార్డింగ్ రిపోర్ట్ (సీడీఆర్) కూడా చిక్కే అవకాశం లేదు. దీంతో ఎవరు ఎవరికి టచ్ లో ఉన్నారోనన్న విషయంపై స్పష్టత రాకుండా పోయింది.

వేగులపైనే ఇంటలీజెన్స్ ఆధారం..

ఇప్పటి వరకు ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారన్న విషయం ఈజీగా తెలుసుకునే అవకాశం ఉండేదని, వాట్సప్ కాల్స్ తో ఎవరి శిబిరంలో ఎం జరుగుతోంది అన్న విషయాలు సేకరించేందుకు పాత పద్దతిలోనే వేగులను ప్రత్యక్ష్యంగా పంపించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈటల శిబిరంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆరా తీసేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపక తప్పలేదని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులపై నిఘాను కట్టుదిట్టం చేసిన సర్కారు మినిట్ టు మినట్ అప్ డేట్ చేయాలని ఆదేశించినట్టు సమాచారం.

అంగరక్షకులపై నజర్…

వీఐపీల సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన గన్ మెన్ల కదలికలపై కూడా పోలీసు బాసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కొంతమంది నాయకుల కదలికలను తెలుసుకునేందుకు గన్ మెన్ల మూవ్ మెంట్ తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే వీఐపీల కదలికలు ఏంటీ, వారు జర్నీలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయాలను ఎప్పటికప్పడు సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీఐపీలు ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ తో తమ మనసులోని భావాలను కూడా పంచుకుంటారని అప్పుడు వారేం మాట్లాడారో కూడా పూసగుచ్చినట్టు చెప్పాలన్న ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed