గులాబీకి ‘గ్రేటర్’గుబులు!

by  |
గులాబీకి ‘గ్రేటర్’గుబులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలపై గులాబీ శ్రేణుల్లో గుబులు పట్టుకుంది. డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లేలా పార్టీ మొదట కసరత్తు మొదలుపెట్టింది. నవంబరు రెండో వారం నుంచి ఎన్నికల ఏర్పాట్ల కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ఇటీవల సంకేతాలిచ్చారు. కానీ, గ్రేటర్‌ను ముంచెత్తిన వర్షాలతో ఇప్పుడు ఆ పార్టీ డైలమాలో పడింది. వరద సాయానికి వెళ్లిన టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులను (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు) బాధిత ప్రజలు గట్టిగానే నిలదీశారు. ఊహించని విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. రూ.10వేల సాయంతో వ్యతిరేకతను కూల్ డౌన్ చేయొచ్చని భావించారు. కానీ, ఐదు రోజుల అనుభవం ఆశించిన పలితాలు ఇవ్వలేదని పార్టీ నేతల్లో జనరల్ అభిప్రాయం ఏర్పడింది. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం సర్కారు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా నిర్వహించడానికి సిద్ధంగానే ఉన్నామంటోంది.

సెటిలర్ల ఓట్ల కోసం పావులు..

టీఆర్ఎస్ పార్టీ సెటిలర్ల ఓట్లపై చాలా ఆశలు పెట్టుకుంది. దాదాపు ఏడెనిమిది డివిజన్లలో సెటిలర్ల ఓట్లే కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి ఓట్ల కోసం ఆ పార్టీ పావులు కదుపుతోంది. సెటిలర్లు సంక్రాంతి పండుగ కోసం వెళ్తారని, తిరిగి వచ్చిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించడం మేలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అప్పటికి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి బల్దియా ఎన్నికల్లో ఆ అంశాన్ని కూడా అనుకూలంగా వాడుకోవచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. సెటిలర్ల ఓట్లపై పలువురు నేతలకు బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు సెటిలర్ల ఓట్ల కోసం ప్రత్యేకంగా బృందాలను తిప్పుతున్నారు.

గులాబీ దూకుడుకు వరదలు బ్రేక్..

గ్రేటర్‌లో 100 సీట్లపై మరోసారి గురిపెట్టిన టీఆర్ఎస్‌కు అక్టోబర్ వర్షాలు బ్రేక్ వేశాయి. గ్రేటర్ ఎన్నికలకు అంతా సిద్ధమనుకనే సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు అధికార టీఆర్ఎస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. నిర్ణీత గడువుకు ముందుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ వరదలు జలదిగ్బంధం చేయడం ఆ ప్రయత్నాలకు గండిపడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. మైనంపల్లి హన్మంతరావును నేరుగానే నిలదీశారు. బీఎన్‌రెడ్డి నగర్‌లో ముంపు బాధితులు మంత్రి కేటీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వరదల పర్యటనలో నిరసనలు ఎదురయ్యాయి. పడవలో పర్యటనకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిని బాధిత మహిళలు మొహం మీదే కడిగేశారు.

ప్రజాప్రతినిధుల నిలదీత..

ఇక ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మీదకు ఏకంగా చెప్పులే విసిరారు. కూకట్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీశారు. బస్తీల్లోకి రాకుండా అడ్డుకున్నారు. మంత్రుల వెంట ఉన్న స్థానిక కార్పొరేటర్లను నిలదీశారు. వీధుల్లో, బస్తీల్లో వరద కారణంగా ఏర్పడిన సమస్యలపై కార్పొరేటర్లపై దుమ్మెత్తి పోశారు. కబ్జాలు, ఆక్రమణలకు అండగా ఉన్నారని, ఫిర్యాదులు చేసినా అడ్డుకోలేదనీ, నాలాల వెడల్పు, పూడికతీత వంటి సమస్యల గురించి గతంలో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏ మాత్రం పట్టించుకోలేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. కొత్తగా కట్టుకునే ఇండ్ల దగ్గరకు వచ్చి లంచాల కోసం దాడులు చేయించారని, ఇందుకు అనుమతులు లేవంటూ కుంటిసాకులు చెప్పి ఇబ్బంది పెట్టారని కూడా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి పరిష్కారం చూపకుండా పలకరింపులకు వస్తారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హయత్‌నగర్‌లో కార్పొరేటర్‌పై ముంపు బాధితులు ఏకంగా దాడికే దిగారు.

ఇప్పుడు వద్దు ప్లీజ్..

హైదరాబాద్‌లో వరదలు టీఆర్ఎస్ పార్టీకి ఆటంకాలే తెచ్చిపెట్టాయి. తొలుత డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలనుకున్నా తాజా పరిస్థితులు అనుకూలంగా లేవని నివేదికలు రావడంతో షెడ్యూల్ ప్రకారం లేదా ఆ తర్వాత కొంత కాలానికి నిర్వహిస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రజలు వరద బాధలను మర్చిపోకముందే ఎన్నికలకు వెళ్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల కేటీఆర్‌కు మొరపెట్టుకున్నారు.

మేమైతే సిద్ధం : ఎన్నికల సంఘం

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) మాత్రం సకల ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. బ్యాలెట్ బాక్సులను రెడీ చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నవాటికి తోడు ఏపీ, మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగించింది. ఎన్నికల నిర్వహణ కోసం గ్రేటర్ పరిధిలో సిబ్బందిని నియమించుకుని వర్క్ డివిజన్ చేసింది. నవంబరు నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చేలా సిద్ధమైంది. కానీ, ఇప్పుడు వరదల అనంతర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సర్కారు నిర్ణయానికి అనుగుణంగా ఎప్పుడు రిజర్వేషన్లు ఖరారైతే అప్పుడే ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటోంది. జీహెచ్ఎంసీ చట్టానికి తాజాగా జరిగిన సవరణల ప్రకారం ప్రభుత్వంతో సంప్రదింపులు అయిన తర్వాతనే ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.



Next Story