సెల్ ఫోన్లు నిషేధం.. క్రాస్ ఓటింగ్ జరగకుండా టీఆర్‌ఎస్ భారీ ప్లాన్

by  |
trs leader
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతిధులను అధికారపార్టీ క్యాంపులకు తీసుకెళ్లింది. గతవారం రోజులుగా క్యాంపుల్లోనే ఉన్నారు. అయితే గోవా, బెంగుళూరులోఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు ఫోన్ లు చేసేవారు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు ఫోన్ చేస్తుండటంతో ఎక్కడ ఓట్లు క్రాస్ అవుతాయేమోనని టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఫోన్లను బ్యాన్ చేయడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే తాము క్యాంపుల్లో ఉండబోమని పేర్కొనడంతో తిరిగి ఫోన్లు ఇచ్చినట్లు సమాచారం.

ఎన్నికలు జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపునకు తీసుకెళ్లింది. గోవా, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. అయితే బరిలో కాంగ్రెస్ తోపాటు స్వతంత్రులు గట్టిపోటీ ఇస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ఆదిలాబాద్ , కరీంనగర్, మెదక్ కు చెందిన ఇండిపెండెంట్లకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అయితే టూర్ కు వెళ్లిన స్థానిక సంస్థల ప్రతినిధులకు చెందిన బంధువులతో నిత్యం ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా తాయిలాలు ప్రకటిస్తున్నారన్న సమాచారం టీఆర్ఎస్ నేతల దృష్టికి వెళ్లింది. దీంతో కరీంనగర్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రతినిధుల ఫోన్లను ఇన్ చార్జుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. దీంతో తీవ్ర అభ్యంతరంతోపాటు నిరసన తెలిపినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక 24 గంటల తర్వాత మళ్లీ ఫోన్లు ఇచ్చినట్లు తెలిసింది.

క్యాంపుల్లో భాగంగా గెట్ టు గేదర్ నిర్వహిస్తుండటంతో ప్రజాప్రతినిధులు డ్యాన్సులు వేస్తున్న వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి బయటకు రాకుండా నిరోధించేందుకు సెల్ ఫోన్లను నిషేధించినట్లు సమాచారం. పార్టీ అయిపోయిన తర్వాత ఫోన్లు మాట్లాడుకోవచ్చని అప్పటి వరకు ఫోన్లు మాత్రం వినియోగించొద్దని క్యాంపు ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నవారు సూచించారు. ఏదీ ఏమైనప్పటికీ క్యాంపులో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లపై అధికారపార్టీ నిఘా పెంచింది. ఓట్లు క్రాస్ కాకుండా చర్యలు తీసుకుంటుంది.

Next Story