అచ్చంపేటలో వింత ఘటన.. ఆదివాసీల ఆవేదన వర్ణనాతీతం

by  |
girijanulu-21
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గిరిజన భవనం వద్ద ఆదివాసీలు గిరిజనులకు న్యాయ సేవల శిబిరం పై అవగాహన సదస్సును అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు నల్లమల ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 12 నుంచి 15 వందల మంది గిరిజనులు హాజరయ్యారు. అయితే, భారీ ఎత్తున వారు తరలిరావడంతో హాల్ పూర్తిగా నిండిపోయి చాలా మంది గిరిజనులు బయట నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకు వచ్చామో తెల్వడం లేదు

నల్లమలలోని చెంచు పెంటల నుండి వచ్చిన ఆదివాసీలను ” దిశ ” ప్రతినిధి ఈ సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు? మీకేమైనా అర్థమైందా ? అధికారులు ఏమి చెప్పారు ? న్యాయ సేవల శిబిరం అంటే ఏమిటి అని పలకరించగా… ‘సార్ వాళ్లు ఏమి చెబుతున్నారో తెలియదు.. కూర్చోడానికి చోటు లేక బయట వచ్చి కూర్చున్నాం.. మీరు అడిగిన వాటికి నాకు ఏం తెలియటం లేదు.. మేం ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదు’ అని మల్లాపూర్ పెంటకు చెందిన బయమ్మ తెలిపింది.

పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని వచ్చాం

పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వచ్చామని, అధికారులు ఏం మాట్లాడారో తెలియడం లేదని పదర మండలం పెట్రోల్ చేను పెంటకు చెందిన ఉపసర్పంచ్ వెంకటమ్మ అంజి తెలిపాడు. వివిధ పెంటల నుండి వచ్చిన వీరికి సదస్సు అయిపోయేంత వరకూ ఏం అర్థం కాకా విస్తుపోయాం అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ఈ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్నం పొట్లాల కోసం…

ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ చెంచు గూడాల నుండి వచ్చిన ఆదివాసీ గిరిజనులు అన్నం పొట్లాల కోసం ఎగబడ్డారు. పోలీసులు కల్పించుకుని అన్నం పొట్లాలను స్వయంగా వారే పంచిపెట్టారు. మొత్తానికి న్యాయ సేవల శిబిరం అధికారులు అంచనాలకు అనుగుణంగానే విజయవంతం అయినప్పటికీ.. సదస్సుకు హాజరైన ఆదివాసులు ఎందుకు వచ్చామో అర్థం కాలేదని చర్చించుకోవడం కొసమెరుపు.



Next Story

Most Viewed