హమాలీలుగా.. అవలీలగా

by  |
హమాలీలుగా.. అవలీలగా
X

దిశ, నిజామాబాద్: మహిళలు మానసికంగా దృఢంగా ఉంటారే తప్ప శారీరకంగా కాదనే అపోహ.. సమాజంలో అనాదిగా పాతుకుపోయింది. నిజానికి అది అపోహే.. ఎందుకంటే శారీరకంగానైనా, మానసికంగానైనా తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు నేటి తరం మహిళలు. అమ్మగా పిల్లల ఆలనా పాలనే కాదు.. అంతరిక్షంలోనూ అడుగుపెట్టి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే.. మహిళలు ఎక్కువగా వ్యవసాయ కూలీ పనులకే పరిమితమవుతుంటారు. బరువులెత్తే పనుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే లాక్‌డౌన్ కారణంగా హమాలీల కొరత ఏర్పడటంతో చాలా ప్రాంతాల్లో ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో 13 మంది మహిళా కూలీలు హమాలీల అవతారమెత్తారు. తమ గ్రామ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలను లారీల్లో లోడ్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో గ‌తంలో కన్నా ఈ యేడు ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగింది. కానీ హ‌మాలీల కొర‌త కారణంగా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండగా.. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులైనా కొనుగోళ్లు జరగడం లేదు. కరోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల హ‌మాలీలు ఇత‌ర రాష్ట్ర‌ాల నుంచి రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనేది అధికారుల మాట. అయితే ఈ స‌మ‌స్య‌ను అధిగమించేదుకు నిజామాబాద్ జిల్లా, దర్ప‌ల్లి మండ‌లం, డీబీ తండాకు చెందిన మ‌హిళలు ముందుకొచ్చారు. 13 మంది గిరిజన మహిళలు హమాలీలుగా మారారు. ఓ వైపు పురుషులే హ‌మాలీ ప‌నిచేసేందుకు వెనకాడుతుంటే.. ఈ గిరిజన మహిళలు మాత్రం ధాన్యాన్ని గోనె సంచుల్లోకి ఎత్త‌ి, తూకం వేయ‌డంతో పాటు వాటిని లారీల్లోకి అవ‌లీల‌గా లోడ్ చేస్తూ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆడ‌వారు త‌లచుకుంటే ఇంటి పనే కాదు.. ఎంతటి ప‌నైనా చేయగల‌ర‌ని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.



Next Story

Most Viewed