‘‘కరోనా’ వాస్తవ గణాంకాలు వెల్లడించాలి’’

by  |

దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) సంక్రమణకు సంబంధించిన వాస్తవ గణాంకాలను వెల్లడించ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కేసుల సంఖ్య తక్కువ చూపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో కరోనా టెస్టుల వేగం పెంచితే తెలంగాణలో టెస్టుల సంఖ్యను తగ్గించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం అల్పసంతోషం వ్యక్తం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) రాష్ట్రంలో తమ పనిని సరిగ్గా నిర్వర్తించలేదన్నారు. సోషల్ మీడియా కోసం చిత్రాలు, వీడియోలను చిత్రీకరించడం తప్ప వారు రాష్ట్రంలోని వాస్తవాలను గుర్తించ లేదని విమర్శించారు. కరోనా వైరస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ఫ్లూగా పరిగణిస్తోందని ఆరోపించారు. అందువల్లనే కరోనా వైరస్‌ను నియంత్రించడానికి పూర్తి శ్రద్ధ చూపడంలో వైఫల్యం చెందిందన్నారు. ఈ విషయంలో నిర్ణక్ష్యం చేస్తే లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణలోని కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ చేశారు.

Tags: Congress, Narayana reddy, demands, statistics of, covid 19, tests, govt failure


Next Story

Most Viewed