ప్రభుత్వం మానవత్వాన్ని ప్రదర్శించాలి

by  |
ప్రభుత్వం మానవత్వాన్ని ప్రదర్శించాలి
X

– వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతలు

దిశ, న్యూస్‌బ్యూరో : ప్రభుత్వం వలస కార్మికుల విషయంలో ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రేషన్ కార్డులు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కరోనా వైరస్ (కొవిడ్ -19) నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక సలహాలు అందిస్తోందని, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆర్.సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ‌గా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్నప్పటికీ టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించకుండా, వాస్తవ పరిస్థితులు తెలియకుండా.. కేవలం లాక్‌డౌన్‌తోనే ఈ సమస్య పరిష్కారం కాదని అన్నారు. భారీ ఎత్తున పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్రంలో 8 లక్షల దాకా వలస కూలీలు ఉంటే.. కేవలం 3 లక్షల మందికే లెక్కగట్టి బియ్యం, రూ.500 ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘించి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరుగుతున్నారని విమర్శించారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో తిరిగిన వారిపై చర్యలు తీసుకోకుండా.. నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పతులు పెద్దఎత్తున మార్కెట్లోకి వచ్చాయని, ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని ఎద్దేవా చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని అన్నారు. సోనియా గాంధీ చెప్పిన విధంగా ఉపాధి హామీ కూలీలకు 21 రోజుల వేతనాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి ఆదుకోవాలన్నారు. సీఎం సహాయ నిధికి వచ్చిన నిధుల వివరాలను వెల్లడించడం లేదని అన్నారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న వ్యాపార వర్గాలకే కొమ్ము కాస్తున్నదని విమర్శించారు.

Tags : TPCC, AICC Secretary Kuntia,congress leaders, Uttam Kumar Redy, Sonia, Video conferance



Next Story

Most Viewed