వాస్తవ గణాంకాలపై శ్వేతపత్రం రిలీజ్ ‘కరోనా’

by  |
వాస్తవ గణాంకాలపై శ్వేతపత్రం రిలీజ్ ‘కరోనా’
X

-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్

దిశ, న్యూస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వాస్తవాలను వెల్లడించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కరోనా వైరస్‌(కొవిడ్ -19)‌కు సంబంధించిన వాస్తవ గణాంకాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆ పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్ 19 కట్టడికి లాక్‌డౌన్ దీర్ఘకాలికంగా కొనసాగుతున్నందున విస్తృతమైన సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఉత్తమ్ పిలుపు నిచ్చారు. కొవిడ్ -19 రోగుల, అనుమానితులు, మరణాల వాస్తవ గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చెందుతున్నారన్నారు. ఇది దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణలో కొవిడ్ 19 కేసుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రుల్లో, పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు, మందులు, వైద్య పరికరాలు, పరీక్షల వస్తు సామగ్రి, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్న వైద్య నిపుణులు పరిస్థితిని ఎదుర్కొవటానికి అవసరమైన ఆర్థిక పరిస్థితి‌పై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

లాక్‌డౌన్ కాలం ముగిసిన వెంటనే రాష్ట్రం సాధారణ స్థితికి రాకపోవచ్చునని ఉత్తమ్ అన్నారు. అందువల్ల లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం చేయడానికి కాంగ్రెస్ నాయకులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కార్యకర్తలను కోరారు. రోజువారీ వేతన కూలీలు, వలస కార్మికులు, నిరాశ్రయులైన ఇతర పేద వర్గాలకు ఆహారం సరఫరా చేయడమే తక్షణ ప్రాధాన్యతని వివరించారు. జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి సహాయం అందించాలని కోరారు. సహాయక కార్యక్రమాలను వ్యవస్థీకృత పద్ధతిలో చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు గాంధీ భవన్‌లోని ప్రధాన కంట్రోల్ రూంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే ప్రతి ఒక్కరినీ ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా అనుసంధానించాలని ఆయన సూచించారు. కొవిడ్ 19 కేసుల సంఖ్యపై మీడియా బులిటిన్‌లను రోజూ విడుదల చేయడంలో అధికారులు విఫలమవడం వల్ల ఇలాంటి ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.

Tags: TPCC Chief Uttam, video conference, congress leaders, demand, white paper , covid 19 cases

Next Story

Most Viewed