దిగుబడి వచ్చినా.. దిగులు తప్పలె!

by  |
దిగుబడి వచ్చినా.. దిగులు తప్పలె!
X

దిశ, రంగారెడ్డి: పండించిన పంటకు గిట్టుబాటు రాక రైతులు దిగాలు పడుతున్నారు. దిగుబడి పెరిగి కష్టాలు తీరుతాయని ఆశించిన వారు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో రైతులు టమాట, క్యాబేజీ పంటలు పండించి అధికంగా దిగుబడి తీసుకువచ్చినా కనీసం కూలీల ఖర్చు, కిరాయిలు రాక తంటాలు పడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక పంట చేనులో పశువులను మేపుతున్నారు.

వీర్లపల్లి, బూచన్‌పల్లి, పట్లూరు, మర్పల్లి, పంచలింగాల్‌తో పాటు పలు గ్రామాల్లో రైతులు టమాటను 200హెక్టార్లలో, క్యాబేజీని 150 హెక్టార్లలో సాగు చేశారు. ఎకరం భూమిలో వేసిన టమాట పంటకు రూ.40వేలు, క్యాబేజీ పంటకు రూ.50వేల పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడి తీసుకు వచ్చారు. కానీ దిగుబడి వచ్చిన సంతోషం లేకుండా మార్కెట్లో కిలో టమాట రూ.5, రెండు కిలోల క్యాబేజీకి రూ.10 కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

మర్పల్లి మండలానికి చెందిన కుడుగుంట ప్రకాశ్ అనే రైతు తన ఎకరం భూమిలో టమాట సాగు చేశాడు. అయితే దిగుబడిని చూసి కష్టాలు తీరుతాయనుకున్న అతనికి మార్కెట్లో సరైన మద్దతు ధర లభించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక మిగిలిన పంటను మొత్తం వదిలేసి పశువులను మేపుతున్నాడు.

Tags: Rangareddy, Tomato, Cabbage, Tomato, Rs.5, Cabbage, Vikarabad Farmers

Next Story