ఫిరోజ్‌షా కోట్లా కేంద్రంగా ‘బెట్టింగ్’.. డీడీసీఏ ఉద్యోగి అరెస్టు

by  |
feroj-sha-kotla 1
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 రెండో విడత మ్యాచ్‌లు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన విషయం తెలిసందే. కరోనా కారణంగా కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌ల అనంతరం లీగ్ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే మే 2న ఢిల్లీలోకి ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని గ్యాలరీల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు బయటకు ఫోన్‌ల ద్వారా చేరవేస్తున్నట్లు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే ఆ ఇద్దరినీ చెక్ చేయగా నకిలీ బీసీసీఐ అక్రిడిటేషన్ కార్డులు లభించాయి. మనీష్ కన్సల్, క్రిష్ణన్ గార్గ్ మ్యాచ్ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. కాగా వీరిద్దరికీ అక్రిడిటేషన్ కార్డులు తయారు చేయాలని వీరేందర్ సింగ్ షా, బాలమ్ సింగ్‌‌లను బుకీలు కోరారు. వీరిలో వీరేందర్ సింగ్ షా ఒక సంస్థలో లైజనింగ్ ఆఫీసర్ వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఆ సంస్థ ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కొరకు అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన పని చేస్తుంది. డీడీసీఏలో అటెండర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తితో కలసి వీరిద్దరూ నకిలీ కార్డులు సృష్టించారు. వాటిని మనీష్ కన్సల్, క్రిష్ణన్ గార్గ్‌కు ఇవ్వడంతో వాళ్లు ఫిరోజ్ షా కోట్లా మైదానంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.

టాస్ నుంచి బాల్ టూ బాల్ ఫిక్సింగ్ వరకు..

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే మ్యాచ్‌లకు హౌస్ కీపింగ్ కంపెనీలో పని చేస్తున్న ఒక వ్యక్తి, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న మరో వ్యక్తికి చెందిన ఫామ్స్‌ను తప్పించిన షా, బాలమ్‌లు వాటిని మనీష్ కన్సాల్, క్రిష్ణన్ గార్గ్ పేర్లతో రిప్లేస్ చేశారు. వారిద్దరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కావడంతో మే 2న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు హాజరయ్యారు. టాస్ దగ్గర నుంచి బాల్ టూ బాల్ ఇన్ఫోను బుకీలకు చేరవేడం మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా గ్రౌండ్‌లో మ్యాచ్‌కు, టీవీల్లో ప్రసారం అయ్యే దానికి రెండు నిమిషాల తేడా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని బెట్టింగ్‌కు తెరలేపినట్లు పోలీసులు చెప్పారు. గత 10 ఏళ్లుగా డీడీసీఏ కోసం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కంపెనీలో షా, బాలమ్‌లు పని చేస్తున్నారు. బుకీలు సంప్రదించగానే వారి మనుషుల కోసం నకిలీ అక్రిడిటేషన్‌లు తయారు చేశారు. అయితే గతంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇలాగే చేరవేశారా లేదా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంతకాలు ఫోర్జరీ..

మనీష్ కన్సాల్‌కు హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా, క్రిష్ణన్ గార్గ్‌కు హెల్త్ వర్కర్ లాగ పాస్‌లు సృష్టించి లోపలికి పంపారు. ముందు వారిద్దరినీ అరెస్టు చేసిన తర్వాత పూర్తి స్థాయలో దర్యాప్తు చేయగా దీని వెనుక ఎవరున్నారో బయటపడింది. గత నెలలోనే అందరికీ అరెస్టు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నకిలీ పాసులు పొందడానికి సమర్పించిన ఆధార్ కార్డు జిరాక్సులపై డీడీసీఏ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం డీడీసీఏ అటెండర్ సహా మిగిలిన ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10న షా ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. అయితే పోలీసులు అతడికి బెయిల్ ఇస్తే కీలక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని వాదించడంతో కోర్టు అతడి బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం వీరందరినీ జ్యూడీషియల్ కస్టడీకి పంపుతూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసలు మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడిన కీలకమైన బుకీల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. వారు దొరికితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.


Next Story