వరదలకు ఆస్ట్రేలియా అతలాకుతలం.. వేలాది మంది తరలింపు

by  |
Australia floods
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలమవుతున్నది. ఆ దేశ రాజధాని సిడ్నీతో పాటు దానికి ఆనుకుని ఉన్న న్యూసౌత్ వేల్స్, క్వీన్స్‌లాండ్ రాష్ట్రాలు వరద దాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. గత యాభై ఏళ్లలో మునుపెన్నడూ చూడనంతగా పలు ప్రాంతాల్లో సుమారు 1000 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. దీంతో ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అక్కడ్నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇప్పటికే సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్ నుంచి సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకైతే వరదల బారిన పడి మరణాలేమీ నమోదు కాలేదని వారు తెలిపారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిడ్నీలో జనజీవనం స్తంభించింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో సిడ్నీలోని హాక్స్‌బెర్రీ, నేపియన్ నదులు ఉగ్రరూపం దాల్చాయి. నేపియన్ నది అయితే దాని సాధారణ ప్రవాహ స్థితి కంటే 13 మీటర్లు (42 అడుగులు) ఎత్తున ప్రవహిస్తుండటం గమనార్హం. ఈ నదికి 1961 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం. సిడ్నీలో ఉన్న పెర్రమట్ట నదిలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

న్యూసౌత్‌వేల్స్ లో వరద తీవ్రత

వరదలు, కుండపోత వానల కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ప్రజా రవాణాను నిలిపివేశారు. విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వచ్చే గురువారం దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

సుమారు 500 వరద సహాయ బృందాలు వరదల్లో చిక్కుకున్న బాధితులకు సేవలను అందిస్తున్నాయి.

వరద బీభత్సంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పంస్పందించారు. సిడ్నీ రేడియో స్టేషన్ వేదికగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇది దేశానికి మరో పరీక్షా సమయం అని అన్నారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దని కోరారు.

Next Story

Most Viewed