బల్దియా ఎన్నికల్లో విచిత్రం

by  |
బల్దియా ఎన్నికల్లో విచిత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంత ప్రయత్నించినా కొందరికి అదృష్టం దూరమవుతోంది. ఎంతగా కష్టపడినా అందినట్లే అంది అందకుండా పోతున్నాయి. రాజకీయాల్లో ఎవరిని నమ్ముకున్నా జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. బల్దియాలో కొందరి పరిస్థితి దారుణంగా మారింది. ప్రతిపక్ష పార్టీల్లో గెలిచి అధికార పక్షంలో చేరిన ఎమ్మెల్యేల అనుచరుల పరిస్థితి దారుణంగా మారింది. తామంతా గెలిపించుకున్న ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకొని రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేస్తారని ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీఆర్ఎస్‌లో పదవులు ఆశించి చేరిన వారికి నిరాశే మిగిలింది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ చాలా మంది కార్పొరేటర్లకు టికెట్లు దక్కవని భావించారు. దాంతో ఆయా స్థానాలపై కొత్తగా పార్టీలో చేరిన నాయకులు దృష్టి పెట్టారు. నిజానికి ఆ కుర్చీలు ఆశించి వచ్చిన వారే అధికం. అయితే సిట్టింగులకే చాలా మటుకు టికెట్లు ఖరారు చేశారు. దాంతో అధికార పార్టీలో చేరి మోసపోయామని బాధ పడుతున్నారు.

ప్రధానంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి (ప్రస్తుత మంత్రి)లు టీఆర్ఎస్‌లో చేరారు. వారికైతే పార్టీ అధిష్ఠానం పెద్దపీట వేసింది. ఒకరికేమో వచ్చీ రాగానే మంత్రి పదవి దక్కింది. సుధీర్‌రెడ్డిని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేశారు. కానీ వారిని నమ్ముకొని వచ్చిన నాయకులకు మాత్రం నిరాశే ఎదురైంది. తనతో పాటు వస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని ఆశలు రేకెత్తించారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్య పోస్టులను, ప్రతిష్ఠను వదిలేసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడేమో వారికెవరికీ టికెట్లు దక్కకపోవడంతో తప్పు చేశామని కార్యకర్తలకు చెప్పుకొని బాధ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే రెండు రోజులుగా చాలా మంది ఎవరి ఫోన్లు ఎత్తడం లేదు. పాత వారిని తీవ్రంగా వ్యతిరేకించిన తాము కాలనీలు, బస్తీల్లో ఎలా ప్రచారం చేస్తామని అంతర్మథనంలో పడ్డారు.

టికెట్ తమకేనని ప్రచారం

టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచరులు కొందరు బల్దియాలో టికెట్లు తమకే వస్తాయని భావించారు. సదరు ఎమ్మెల్యేలు కూడా పక్కా హామీలిచ్చారు. దాంతో గడిచిన రెండు, మూడు నెలలుగా చాప కింద నీళ్లలా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికే ఓ రౌండ్ కాలనీలు, బస్తీల్లో పర్యటించారు. టికెట్ తనకే వస్తుందంటూ కాలనీ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఇంకొన్ని చోట్ల అంతర్గత సమావేశాలు పూర్తి చేశారు. అవసరమైన డబ్బు, ప్రచారానికి సరిపడా వ్యవస్థను రూపొందించుకున్నారు. సొంతూర్ల నుంచి మందీమార్బలాన్ని సిద్ధం చేసుకున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసుకున్నారు. దానధర్మాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు.

తీరా బల్దియా ఎన్నికల జాబితాల్లో వారి పేర్లు కనిపించలేదు. దీంతో బంధుమిత్రులకు, కార్యకర్తలకు ఏం చెప్పాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తన నాయకుడిని నమ్ముకొని రావడం వల్ల నష్టమే కలిగిందని బాధ పడుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చంపాపేట, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, నాగోలు, కొత్తపేట, గడ్డిఅన్నారం, చైతన్యపురి, సరూర్ నగర్, రామకృష్ణాపురం డివిజన్లలో ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి నిరాశే మిగిలింది. సికింద్రాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లోని కొన్ని డివిజన్లను ఆశించిన కొందరు వారి సొంత పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సిట్టింగులకే అనడంతో మోసం

టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. వసూళ్ల దందాకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఆడియో, వీడియోలు కూడా సాక్ష్యాలుగా నిలిచాయి. పలు సందర్భాల్లో అధిష్ఠానం వారిని హెచ్చరించింది. ప్రధానంగా బిల్డర్ల దగ్గర పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కలిసి బిల్డర్లతో సమావేశమై దందాను నడిపేందుకు తెర లేపారు. అప్పట్లో ఆ వీడియోలు మీడియాలో హల్ చల్ చేశాయి. ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. వివాదాలుగా సృష్టించారు.

సెటిల్మెంటు చేస్తూ అడ్డంగా దొరికిన ఉదంతాలు ఉన్నాయి. ఇక వారందరికీ ఈ సారి పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదని భావించారు. కానీ అలాంటి వారిని మళ్లీ బరిలో నిలిపింది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన నాయకులకు మొండిచేయి చూపారు. అనవసరంగా పార్టీ మారామని బాధ పడుతున్నారు. ఆ పార్టీలోనే ఉంటే టికెట్ దక్కేదని కార్యకర్తలకు వారి ఆవేదనను చెప్పుకుంటున్నారు. అనసవరంగా ఎమ్మెల్యేను, మంత్రిని నమ్ముకొని అధికార పార్టీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎవరి వైపు ప్రచారం చేయకుండా మౌనం వహిస్తున్నారు. కొందరేమో అదృశ్యమయ్యారు. ఈ అసంతృప్తులను సిట్టింగు కార్పొరేటర్లు ఏ మేరకు కలుపుకునిపోతారో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed