ఆ రాష్ట్రాల వారికి.. రైల్వే స్టేషన్‌లోనే పరీక్షలు

by  |
ఆ రాష్ట్రాల వారికి.. రైల్వే స్టేషన్‌లోనే పరీక్షలు
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలో ప్రవేశించే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిపై ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచనుంది. కరోనా బారిన పడిన ఇతర రాష్ట్రాల కంటే, ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారి పట్ల మరింత జాగ్రత్తగా మసలుకోనుంది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఢిల్లీలోని తబ్లిఘీ జమాత్ మర్కజ్ అయితే మరొకటి మాత్రం చెన్నైలోని కోయంబేడు మార్కెట్.. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి రైల్వే స్టేషన్‌లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనుంది.

ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి రైల్వేస్టేషన్‌లో పరీక్షలు పూర్తి కాగానే.. ఏడు రోజుల ప్రభుత్వ క్వారంటైన్, మిగతా ఏడు రోజుల హోం క్వారంటైన్ విధించనుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్యులకు ప్రభుత్వ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే, వారు తప్పకుండా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే వారిలో కరోనా లక్షణాలు లేకుంటే క్వారంటైన్ అవసరం లేదని తెలిపింది. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ప్రతి బోగీలో 5 శాతం మంది నుంచి ర్యాండమ్ పద్ధతిలో నమూనాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది.

Next Story