రాష్ట్రంలో 6 'రెడ్ జోన్' జిల్లాలు..

by  |
రాష్ట్రంలో 6 రెడ్ జోన్ జిల్లాలు..
X

– మే 7 తర్వాత కూడా ఆంక్షలు అనివార్యం!

దిశ, న్యూస్ బ్యూరో: రెండో విడత లాక్‌డౌన్ ముగింపునకు వస్తున్న తరుణంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ సడలింపులు కల్పించడం వైపే మొగ్గు చూపుతోంది. లాక్‌డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తి కట్టడి అయినా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతుండటం, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకావడం తదితర అంశాలను
దృష్టిలో పెట్టుకుని పరిమిత ఆంక్షలతో లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు తాజాగా ఇస్తున్న సర్క్యులర్ సందేశాలు కూడా ఇదే సంకేతాలను బలపరుస్తున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో యథావిధిగా ఆంక్షలను కొనసాగిస్తూ ప్రమాదం లేని ప్రాంతాల్లో మామూలు కార్యకలాపాలు కొనసాగే విధంగా ఈ నెల 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రతీ సుడాన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసి ఆయా రాష్ట్రాల్లో ఏయే జిల్లాలు ఏ జోన్‌లో ఉన్నాయో ప్రకటించారు. ఆ జిల్లాలను ఆ జోన్‌లలో పెట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక కూడా వివరించారు. మే నెల 3వ తేదీ తర్వాత కూడా ఈ జోన్లలో ఆంక్షలు కొనసాగనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. దేశం మొత్తం మీద 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19 జిల్లాలు, మహారాష్ట్రలో 14 జిల్లాలు, తమిళనాడులో 12 జిల్లాలు, ఢిల్లీలో 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.

ఆ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, మరో తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి.

హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుకావడం, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, ఇంకా కంటైన్‌మెంట్ క్లస్టర్లు కొనసాగుతుండటం, గడచిన 21 రోజులుగా పాజిటివ్ కేసులు
వస్తూనే ఉండటం.. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వీటిని రెడ్ జోన్‌లో పెట్టినట్లు ఆమె ఆ లేఖలో వివరించారు. మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన తొమ్మిది జిల్లాలు (పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి) గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. ఇందులో మూడు జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. మరికొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదైనా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

కంటైన్‌మెంట్ క్లస్టర్లలో యథావిధిగా ఆంక్షల అమలు

ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉన్న కంటైన్‌మెంట్ క్లస్టర్లు యథావిధిగా ప్రొటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రీతి సుడాన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్ ప్రాంతంలో జన సంచారాన్నినియంత్రించడం, అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం, అత్యవసర సేవల్లో
ఉన్నవారు తప్ప మిగిలినవారు క్లస్టర్ లోపల తిరగకుండా నియంత్రించడం, నిత్యావసర వస్తువుల సరఫరాను ప్రభుత్వ సిబ్బందే పర్యవేక్షించడం, ప్రతి ఇంటిలోనివారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా వైద్య సిబ్బంది పరీక్షలు చేయడం, మార్గదర్శకాల ప్రకారం టెస్టులు నిర్వహించడం,
పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడం, అవసరాన్ని బట్టి వారిని క్వారంటైన్‌లో ఉంచడం.. ఇలాంటి చర్యలన్నీ యథావిధిగా కొనసాగాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. రెడ్ జోన్‌లో ఉన్న ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లాలన్నా, ఆరెంజ్ జోన్‌లో ఉన్న ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా ప్రకటించాలన్నా దానికి తగిన ప్రమాణాలను పాటించాల్సిందేనని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు (జిల్లా యంత్రాంగం) నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు.

1,000కి పైగా కేసులు హైదరాబాద్‌లోనే..

ఆ ఆరు ‘రెడ్’ జిల్లాల్లో అప్రమత్తం రాష్ట్రంలో నమోదైన 1,000కి పైగా కేసుల్లో దాదాపు సగం హైదరాబాద్ నగరానికి చెందినవే అయినందున కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాను (జీహెచ్ఎంసీ) రెడ్ జోన్‌లో పెట్టింది. అయితే, ఈ జిల్లాలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నందున కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఖరారు చేసే విషయంలో వార్డులు, రెసిడెన్షియల్ కాలనీ, పోలీసు స్టేషన్ పరిధి, మున్సిపల్ జోన్.. ఇలాంటివాటిని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌గా నిర్ణయం తీసుకోవచ్చునని వివరించారు. గ్రామాల విషయంలో మాత్రం గ్రామాలు, పంచాయతీలు తదితరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆ ప్రకారం హైదరాబాద్ నగరంలో తొలుత 126కు పైగా కంటైన్‌మెంట్ క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసినా పరిస్థితుల్లో మార్పు రావడంతో దాదాపు యాభై వరకు మామూలు స్థితికి చేరుకున్నాయి. అయితే, రోజూ కొత్తగా వస్తున్న కేసుల్లో అధికం జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నందున క్లస్టర్లు కొనసాగుతున్నాయి. మలక్‌పేట్ గంజ్‌లో ఒకేరోజున 22 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా ప్రకటించక తప్పలేదు.

హైదరాబాద్ నగరానికి తోడు

సూర్యాపేటలో 83 పాజిటివ్ కేసులు నమోదుకావడం, స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుని రోజుల వ్యవధిలోనే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ జిల్లా కూడా రెడ్ జోన్ జాబితాలో చేరింది. అదే విధంగా గద్వాల, వికారాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు కూడా ఈ జాబితాలోకి చేరాయి. మూడు వారాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకపోతే ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లోకి చేరుతాయి.

Tags: Telangana, Red Zone Districts,Orange Zone, Containment Cluster, Corona, Positive

Next Story

Most Viewed