ప్రేమకు, అదృష్టానికి చిహ్నం ‘నల్లపిల్లి’!

by Shyam |
black cat
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఎక్కువమంది భారతీయులు పిల్లులను అపశకునంగా భావిస్తుంటారు. అందులోనూ నల్ల పిల్లులంటే మరింత వ్యతిరేక భావన ఉంటుంది. అంతేకాదు బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే.. దురదృష్టానికి, ప్రతికూలతకు సూచనగా భావిస్తారు. మళ్లీ ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చుని బయలుదేరుతుంటారు. కానీ ఇతర దేశాల్లో నల్ల పిల్లులను శుభప్రదంగా పరిగణంచడంతో పాటు, సంతానోత్పత్తి, ప్రేమ, శ్రేయస్సును అందించేవిగా పరిగణిస్తారు. ఇది ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం.

* యూకేలో పెళ్లి రోజున వధువుకు నల్ల పిల్లిని బహుమతిగా ఇస్తుంటారు. అది తమకు అదృష్టాన్ని తెస్తుందని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లయిన వారి ఇంట్లో పిల్లి ఉంటే, అది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. అది నలుపు రంగు మార్జాలమైతే మరింత అదృష్టమని భావిస్తారు.

* నలుపు లేదా స్వచ్ఛమైన తెల్లని పిల్లులు తమ ఇంటికి శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తాయని జపాన్‌ వాసులు నమ్ముతారు. అంతేకాకుండా నల్ల పిల్లులు చెడును, చెడు వ్యక్తుల్ని దూరం చేస్తాయని విశ్వసిస్తారు.

* ఫ్రాన్స్‌లో నల్ల పిల్లుల్ని మాగోట్స్ అని పిలుస్తారు. నల్ల పిల్లికి సరైన ఆహారం అందిస్తే, అది అదృష్టం తెస్తుందని భావిస్తారు.

* పిల్లి ఇంట్లోకి ప్రవేశిస్తే.. సంపద త్వరలో తలుపు తడుతుందని స్కాటిషర్లు భావిస్తారు. వెళుతున్న దారిలో నల్ల పిల్లి ఎదురురావడాన్ని అదృష్టంగా పరిగణిస్తారు.

* నల్ల పిల్లులు ప్రేమకు చిహ్నాలని, అవి సంతానోత్పత్తిని పెంచుతాయని నార్వేజియన్ పురాణాలు చెబుతున్నాయి. ‘గాడెస్ ఆఫ్ లవ్ అండ్ ఫెర్టిలిటీ’ ఫ్రీజా రథాన్ని పిల్లులు లాగుతాయి. ఈ కారణంగానే బ్లాక్ క్యాట్స్‌ను ఆరాధిస్తారు.

* ఈజిప్టులో నల్ల పిల్లులను దేవుడిగా పూజిస్తారు. ఓ కుటుంబంలో నల్ల పిల్లి చనిపోతే ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతోంది. బాస్టెట్ దేవత ప్రాతినిధ్యంగా బ్లాక్ క్యాట్‌లు నిలుస్తాయి. స్త్రీలు, గృహాల రక్షకుడు ‘బాస్టెట్’ కాగా.. పురాతన ఈజిప్టులో నల్ల పిల్లులు దుష్ట ఆత్మలను దూరంగా తరిమికొడతాయని నమ్మేవారు.

Advertisement

Next Story