యుద్ధ వితంతువుల కోసం ఆర్మీ ఆఫీసర్స్ స్పెషల్ మిషన్‌.. అలాంటి వారందరి సమస్యలకు పరిష్కారం..

by  |
army
X

దిశ, ఫీచర్స్: కేరళ రాష్ట్రం, కాలమసేరికి చెందిన దివంగత సంతోష్ కుమార్ భార్య మినీ సంతోష్‌కు ఒంటరిగా కూతురి పెళ్లి ఎలా చేయాలో తెలియలేదు. అతను 1988లో లైన్ ఆఫ్ కంట్రోల్‌ పోస్ట్‌లో ఉండగా మరణించాడు. అప్పటి నుంచి సింగిల్ మదర్‌గా కుమార్తెను కష్టపడి పెంచింది మినీ. ఈ సమయంలోనే స్థానికులు వీర మరణం పొందిన జవానుకు గౌరవ సూచకంగా అతడి కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకలో ఇండియన్ ఆర్మీలోని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన 44 మంది అధికారులు కూడా పాల్గొన్నారు. జమ్మూ నుంచి తిరువనంతపురం వరకు యుద్ధ వితంతువులు, అనారోగ్యంతో ఉన్న మాజీ సైనికులను కలుసుకునేందుకు చేపట్టిన బైక్ ర్యాలీలో భాగంగా వారు అక్కడకు వచ్చారు. ఈ ఆఫీసర్స్ తాము ప్రయాణించిన ప్రతి జిల్లాలో యుద్ధ వితంతువులు, మాజీ సైనికుల నుంచి సమస్యల వివరాలు తెలుసుకుని.. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు నివేదిక సమర్పిస్తారు. అధికారులు ఈ విధంగా సంబంధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు, ఆందోళనలు స్వీకరించడం దేశంలో ఇదే తొలిసారి.

డిసెంబర్ 4న మద్రాస్ రెజిమెంట్ 263వ పుట్టినరోజు. 1971లో బంగ్లాదేశ్‌తో యుద్ధంలో భారతదేశం విజయం సాధించి యాభై ఏళ్లయింది. ఈ సందర్భాన్ని(గోల్డెన్ జూబ్లీ వేడుకలు) పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీ డిసెంబర్ 4న తిరువనంతపురంలో ముగింపు దశకు చేరుకుందని బృందానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ హేమంద్ రాజ్ తెలిపారు. ఈ బృందాలు జమ్మూ నుంచి న్యూఢిల్లీ, జామ్‌నగర్, కోల్‌కతా, సికింద్రాబాద్, చెన్నై, ఊటీల మీదుగా ప్రయాణిస్తున్నాయి. రైడ్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. యుద్ధ వితంతువులు, మాజీ సైనికులతో కాకుండా పాఠశాల పిల్లలు, స్థానికులు, రాజకీయ నాయకులతో పరస్పరం సంభాషించడానికి ఆర్మీ టీమ్.. ప్రతీ పాయింట్‌లో కనీసం 45 నిమిషాలు గడుపుతుంది.

Next Story