నల్లమలలో పోడు పోరు.. అగ్గి రాజేస్తున్న అటవీ అధికారులు

by  |
నల్లమలలో పోడు పోరు.. అగ్గి రాజేస్తున్న అటవీ అధికారులు
X

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, అటవీ శాఖ అధికారుల మధ్యన ఒక విధమైన యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ యుద్ధంలో అటవీశాఖ అధికారులు పై చేయి అవుతూ…. బతకడానికి భూములను సాగు చేస్తున్న రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పవచ్చు. హరితహారం, నర్సరీల పేరుతో ప్రభుత్వం అడవుల పెంపకాన్ని మరియు సంరక్షణ చర్యలు తీసుకోవడాన్ని అందరూ ఏకీభవిస్తున్నారు. కానీ అడవుల్లో మైదాన ప్రాంతాలు చాలా ఉన్నాయని, అక్కడ హరితహారం పేరుతో మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా అటవీశాఖ అధికారులు మేము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వం అంటే అటవీశాఖ అన్న చందంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్యన పోడు రగడ రగులుకుంటుంది. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో కొల్లాపూర్, లింగాల, బల్మూరు, అమ్రాబాద్, పదరా మండలాలు అలాగే నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలాలలో రోజుకు ఒక చోట పోడు భూముల రగడ కొనసాగుతూనే ఉన్నది. అటవీశాఖ అధికారులు పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులు, గిరిజనేతరులకు పోడు భూములు సాగు చేసుకునే హక్కులు లేవని రైతులపై అడవి శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

మూడు దశాబ్దాలకు పైగా సాగు…

నల్లమల ప్రాంతంలోని మండలాలలో గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2006 ఆర్ఓఎఫ్ఆర్ యాక్టు ప్రకారం సుమారు 1501 వందల కుటుంబాల ఆదివాసీ గిరిజన రైతులు పోడు భూములకు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 945 కుటుంబాలకు మాత్రమే హక్కు పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి నేటికీ హక్కు పత్రాలు అందజేయలేదు. ఆర్ఓఎఫ్ఆర్ యాక్టు 2006 ప్రకారం పోడు భూముల సాగు చేసుకుంటున్న ఆదివాసి రైతులు హక్కు పత్రాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జ్ఞానం లేకపోవడం, సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం ద్వారానే చాలామంది ఆదివాసి గిరిజన రైతులు వెనుకబడి పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా ఆర్జీలు మాయమయ్యాయి…

అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన కొంతమంది గిరిజన రైతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఐటీడీఏ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని 2005 లోనే దరఖాస్తు చేసుకున్నప్పటి, అధికారులు నిర్లక్ష్యం మూలంగా నష్టపోయామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఐదు జిల్లాలను కలుపుకొని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీలు అర్జీలు పెట్టుకున్నా పత్రాలు ఏపీ లోని సున్నిపెంట కార్యాలయం నుండి మన్ననూర్ కార్యాలయానికి ఫైల్స్ బదిలీ చేయకపోవడం వలన సుమారు 52 గిరిజన కుటుంబాలకు హక్కు పత్రాలు అందకుండా నిర్లక్ష్యం జరిగిందని చెపుతున్నారు.

గిరిజనులు కాని రైతులు….

అలాగే నల్లమల ప్రాంతంలో గిరిజనులు కానీ రైతులైన షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన రైతులు కూడా రెండు దశాబ్దాలకు పైగా పోడు భూములను సాగు చేస్తూ ఉన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం గిరిజనులు కానటువంటి వారు కూడా ఏజెన్సీ ప్రాంతంలో మూడు తరాలుగా ఇక్కడే జీవిస్తే వాటి ఆధారంగా గిరిజనులు అటువంటి వారికి కూడా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పై యాక్ట్ చెబుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మాత్రం ఆదివాసీ గిరిజనులకే పోడు భూముల విషయంలో హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రజలను రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటివరకు గిరిజనులు కానటువంటి వారికి ఏ ఒక్క రైతుకు పోడు భూముల హక్కు పత్రాలు సంబంధిత అధికారులు అందజేసిన పాపాన పోలేదు.

రైతులపై ఉక్కుపాదం మోపుతున్న అటవీశాఖ

నల్లమల ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రైతులు సాగు చేసుకుంటున్న భూముల వద్దకు వెళ్లి సాగు చేసుకునేందుకు మీకు హక్కులు లేవని, అట్టి భూములలో నర్సరీలు ఏర్పాటు చేస్తామని వెళ్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులను రైతులు అడ్డు తగులుతున్న సందర్భంగా అటవీ శాఖ అధికారులు మా విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, హత్యాయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, గిరిజన రైతులపై కేసు నమోదు చేసి ఉక్కు పాదము మోపుతూ జైలు పాలు చేస్తున్నారు. వారం పది రోజులు గడువిస్తున్నాం మాపై ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఉన్నాయనే సాకుతో ఆ తర్వాత ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని సంబంధిత అధికారులు రైతులను ఆందోళనకు గురి చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పాలకులు మొత్తుకున్నా వినకుండా… అటవీశాఖ దూకుడు

పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు రైతుల వద్దకు వెళ్ళకూడదని, పొడు భూముల విషయం త్వరలోనే ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటున్నారని చెప్తున్నారు. సీఎం నిర్ణయం తీసుకునేంత వరకు అధికారులు సమయపాలన పాటించాలని, పాలకులు ఎంత మొత్తుకున్న, అధికారులు మాత్రం వినకుండా వారు చేయాల్సిన పని చేసుకుంటూ రైతులకు ఆంక్షలు అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే మాకు న్యాయం జరిగేది ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆనాడు మావోయిస్టులతో వెనక్కి….

నల్లమల ప్రాంతంలో 2006 వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నది. పాలకుల ఎత్తుగడలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరిపిన అనంతరం తదుపరి పరిణామాల వల్ల అప్పటి ప్రభుత్వాలు నల్లమల ప్రాంతంలో మావోయిస్టుల అలజడి, వినికిడి లేకుండా పైచేయిగా నిలిచింది. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అటవీశాఖ అధికారులు రైతుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవు. మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా లేకపోవడం, అటవీ శాఖ అధికారులకు ప్రజా సంబంధాల‌తో అవసరం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఆదివాసీ గిరిజన రైతులను, ఇతర రైతులపై ఆంక్షలు విధిస్తూ కేసులు బనాయిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నలు వస్తే బాగుంటుందని, నల్లమల ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చాలా ప్రదేశాల్లో మైదాన ప్రాంతాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి అడవిని మరింత సంరక్షించుకునే అవకాశాలు ఉన్నాయని నల్లమల్ల ప్రాంత ప్రజలు రైతులు మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాస్త సమయపాలన పాటిస్తే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని, అటవీశాఖ ఉన్నత అధికారులకు నల్లమల ప్రాంతం పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు మొర పెట్టుకుంటున్నారు.


Next Story

Most Viewed