న్యాయం కోసం.. సమాజసేవలో సివిల్ సర్వెంట్స్

by  |
న్యాయం కోసం.. సమాజసేవలో సివిల్ సర్వెంట్స్
X

దిశ, ఫీచర్స్ : ఎంతోమంది తమ పేరు ముందు ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) అనే మూడక్షరాలుండాలనే ఆశయంతో సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. కొంతమంది మాత్రం విస్తృతంగా సమాజసేవ చేయాలనుకుని ఇటువైపు అడుగులేస్తారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, వృత్తిగత బాధ్యతల్లో కలెక్టర్లు తీరికలేని జీవితం గడుపుతారు. అంతేకాదు ప్రభుత్వపరమైన కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూనే.. వాటిని అమలు చేయడంలోనూ ఎంతో కృషి చేస్తారు. అలాగే ప్రభుత్వాధిపతులుగా ప్రజలకు అండగా నిలుస్తూ, వ్యక్తిగతంగా సోషల్ సర్వీస్ చేస్తూనే, సమాజంపై ప్రేమను చాటుకుంటారు. ఈ నేపథ్యంలో చంఢీగడ్‌కు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ అన్యాయమైపోయిన 500 మహిళలకు న్యాయం చేయడానికి కృషి చేస్తే, మరో ఇద్దరు కలెక్టర్లు వర్షపు నీటిని ఒడిసి పట్టి జలసిరులు సృష్టించారు.

అందరికీ ‘వైవాహిక జీవితం’ అందమైన అనుభవం కాకపోవచ్చు. అపురూపంగా చూసుకున్న కూతురిని ఒక వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. కానీ పెద్ద ఉద్యోగం, మంచి జీతం అనేసరికి ఎటు చూడకుండా వివాహం జరిపిస్తారు. కానీ చాలామంది కట్నం కోసమో, ఇతర కారణాలవల్లో పెళ్లి చేసుకున్న తర్వాత వారిని అర్ధాంతరంగా విడిచి విదేశాలకు పారిపోతుంటారు. అలా అన్యాయమైపోయిన యువతులకు చంఢీగడ్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్ సిబాష్ కబీరాజ్ అండగా నిలుస్తున్నాడు.

భర్తలు విడిచిపెట్టిన యువ వధువుల కోసం తమ కార్యాలయంలో స్పెషల్ ‘టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేసి, వారి భర్త పాస్‌పోర్టులను రద్దు చేస్తూ బాధిత మహిళలకు న్యాయం చేస్తున్నాడు. హర్యానా కేడర్ 1999-బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కబీరాజ్ (44), 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన పురుషులు, అమ్మాయిలను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని కొద్దికాలం తర్వాత విదేశాలకు వెళుతుంటారు. మొదట్లో ఏడాదికోసారి వస్తూ వెళ్లేవారు కానీ వారితో తమ భార్య, పిల్లలను ఏనాడు వెంట తీసుకెళ్లరు. ఈ క్రమంలోనే వారు బయట దేశంలో పౌరసత్వం పొంది ఇండియాకు తిరిగి రారు. ఇక అత్తమామలు ఆ మహిళలను గృహహింస, లేదా ఇంటిపనికి పరిమితం చేస్తారు. మరికొందరు వారిని ఇంటి నుండి తరిమేసి, తమ కుమారునికి మరో పెళ్లి చేస్తారు. ఇక హెచ్4 వీసా ద్వారా భర్తలతో వెళ్ళే మహిళలు కూడా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎంతోమంది మహిళలు రోడ్డునపడ్డారు. జీవనోపాధి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్లకు న్యాయస్థానాలు, ఎన్ఆర్ఐ కమిషన్ ఎటువంటి సహాయం చేయలేదు. కబీరాజ్ వీరికోసం పాస్‌పోర్ట్ చట్టం, 1967లోని ఒక విభాగాన్ని చూశాడు. “సెక్షన్ 10 (3) ప్రకారం ఒక భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌పై సమన్లు, వారెంట్ లేదా క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉంటే.. అప్పుడు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు. కానీ ఈ నిబంధన ఎక్కువ వాడుకలో లేదు. ఎందుకంటే, ఇంపౌండింగ్, రద్దు చేయడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. అంతేకాదు వారెంట్, చార్జిషీట్, ఎఫ్ఐఆర్ కాపీలను కలిగి ఉండాలి. సరైన పత్రాలు, కచ్ఛితమైన వాస్తవాధారాలు లేకపోతే కోర్టులో కేసు గెలవదు. ఈ క్రమంలోనే 10-15 మంది బాధిత మహిళలతో ఏర్పడ్డ టాస్క్ ఫోర్స్ అందుకు అవసరమైన పత్రాలను తయారుచేస్తారు. తుది పత్రం కబీరాజ్‌కు అందిస్తారు. తదనుగుణంగా పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తాడు లేదా స్వాధీనం చేసుకుంటాడు. గత మూడు సంవత్సరాల్లో, కబీరాజ్ దాదాపు 500 పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోగా.. తప్పించుకున్న 75 మందికి పైగా భర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళలను బాధితులుగా కాకుండా యోధులుగా తయారుచేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.

కాలువల పునరుద్ధరణ..

పుదుచ్చేరిలోని చాలా జిల్లాలు నీటికరువుతో అల్లాడిపోయాయి. ఒకప్పుడు 150 గ్రామాల్లో 600కి పైగా నీటివనరులున్నాయని రికార్డులు పేర్కొనగా.. ప్రతి గ్రామంలో 3-4 నీటి వనరులను గుర్తించారు. నీటి సమృద్ధి ఉన్న ప్రాంతానికి ఇది సంకేతం కాగా ఆయా కాలువలు, చెరువులను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఫీడర్ చానెళ్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వర్షాకాలంలో ఒక చెరువు నుంచి మరొక చెరువుకు నీటిని పంపించుకోవచ్చు. అయితే కాలక్రమంలో చాలా సరస్సులు, చెరువులు కనుమరుగయ్యాయి. నీటి ఎద్దడిని గమనించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ టి అరుణ్ ఈ సమస్యకు పరిష్కారంగా ‘నీర్ పధివు’ అనే యాప్‌ను అభివృద్ధి చేశాడు. దీని ద్వారా సరస్సులు, చెరువులు, కాలువలను పునరుద్ధరించడానికి నీటి సంరక్షణ ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ‘నీర్ పధివు’ యాప్‌ ద్వారా నీటివనరులను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు, వాటికి యూనిక్ ఐడీ నెంబర్లు కేటాయించారు. భూగర్భ జలస్థాయిలను, మట్టిలోని తేమ పరిమాణాన్ని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా అప్‌డేట్ చేస్తారు. అంతేకాదు ఈ యాప్ చెరువులు, కాలువలను ప్రజలు మురికిగా మార్చకుండా లేదా ఆక్రమించకుండా కాపాడుతుంది. ‘నీరం ఊరుం’ కార్యక్రమంలో భాగంగా చెరువులను పునరుద్దరించే కార్యక్రమం చేపట్టాడు అరుణ్. ఇందులో కార్పోరేట్లు, ఎన్జీఓలు, పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు, ఆలయ పూజారులతో సహా మొత్తంగా 60వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2019 నుంచి చెరువులను క్లీన్ చేయడం, తవ్వడంతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఆయా నీటి వనరుల చుట్టూ చెట్లను నాటారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా భూగర్భజల పట్టికలు 15 అడుగులు పెరిగాక, ఇది స్థానికులకు తాగునీరు అవసరాలను తీర్చడంతో పాటు రైతులకు నీటిపారుదలని క్రమం తప్పకుండా సరఫరా చేస్తుందని డాక్టర్ అరుణ్ చెప్పారు. చెరువులు, సరస్సులతో సహా 198 నీటి వనరుల పునరుజ్జీవనం జరిగింది.

వాటర్ హార్వెస్ట్..

2019 క్లౌడ్ బస్ట్(cloudburst) తర్వాత, వడోదర అంతటా పాఠశాలలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షాలిని అగర్వాల్ ఆ ప్రాంతమంతా తక్కువ ఖర్చుతో కూడిన ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్’ ఏర్పాటు చేసి, అక్కడి పాఠశాలలకు నీటి అవసరాలను తీర్చింది. వర్షాలు సమృద్ధిగా పడినా, అందులో సగానికి పైగా నీళ్లు సముద్రాల పాలవుతున్న విషయం తెలిసిందే. వర్షపు నీటిని సమర్ధంగా వాడుకుంటే సమీప భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య రాదన్నది నిర్వివాదాంశం. అయితే ఇప్పటికీ యంత్రాంగంతో పాటు, వ్యక్తిగతంగానూ చాలామంది వాననీటిని ఒడిసి పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ క్రమంలోనే వడోదర వ్యాప్తంగా 1,071 పాఠశాలలు నీటికొరత సమస్య ఎదుర్కొంటున్నాయి. దాంతో ఆమె ఏడాదిలోపు వర్షపునీటి సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించారు. అయితే ఇందుకోసం అపారమైన ఆర్థిక సహాయం, బలమైన శ్రామికశక్తి అవసరమైంది. షాలిని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్, సీఎస్ఆర్, ఇతర వనరుల నుంచి మొత్తంగా రూ.5.84 కోట్లు సమీకరించింది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయాలంటే రూ.3-5 లక్షలు ఖర్చవుతుంది. ప్రతి ప్రాజెక్టుకు ఇంత మొత్తాన్ని ఖర్చుచేయడం సాధ్యం కాదు. అందువల్ల తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని భావించింది. అందుకోసం నిపుణులను సంప్రదించగా రెండు మోడళ్లతో ముందుకు రావడంతో రూ.25,వేల – 90వేల మధ్య ఖర్చు తగ్గింది. ఇక ప్రాజెక్ట్‌లో భాగంగా స్కూళ్లలో ‘ట్యూబ్ బావు’లను నిర్మించింది. వర్షపునీరు టెర్రస్ నుంచి పైపుల ద్వారా భూమిలోతున నిర్మించిన గదిలోకి వెళతాయి. 110 మి.మీ పైపు గదుల నుండి నీటిని పెర్కోలేషన్ ట్యాంకుకు నెట్టివేస్తుంది. ఆ చాంబర్‌లోనే నీరు ఫిల్టర్ అవుతుంది. ప్రతి వ్యవస్థ లక్ష లీటర్ల నీటిని హార్వెస్ట్ చేస్తుంది. ఈ నీటి యజ్ఞం కోసం వడోదర అంతటా వివిధ వర్క్‌షాపులు, పోటీలు, కార్యక్రమాలతో ప్రజల్లో, విద్యార్థులో అవగాహన పెంచాం.

ప్రతి పాఠశాల ఒక సీజన్‌‌లో వర్షపునీటిని కాపాడుకుంటే, రాబోయే నాలుగేళ్ల వరకు ఇది సరిపోతుంది. ఈ విధంగా 2020లో ‘వర్షాకాల్ నిధి’ ప్రాజెక్టులో భాగంగా 963 పాఠశాలల్లో హార్వెస్ట్ ట్యాంక్స్ నిర్మితమయ్యాయి. దాదాపు 10 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయడం ద్వారా 1.8 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని షాలిని అన్నారు. అంతేకాదు దీనివల్ల భూగర్భజల మట్టాలు కూడా పెరుగుతాయి



Next Story

Most Viewed